ఇన్​చార్జులు మాకొద్దు!.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో వ్యతిరేకత

ఇన్​చార్జులు మాకొద్దు!.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో వ్యతిరేకత

బీఆర్ఎస్ లో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జుల నియామకం.. ఆ పార్టీ లీడర్ల మధ్య చిచ్చు రేపుతోంది. పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సీనియర్ నేతను సీఎం కేసీఆర్ ఇన్ చార్జ్ గా నియమించారు. అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో, బీసీ లీడర్లున్న దగ్గరే ఇన్ చార్జులను నియమించడం ఏంటని ఆ పార్టీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమకు ఇన్ చార్జ్ అవసరం లేదని చెప్పగానే ఒప్పుకుంటున్నారని, తాము చెబితే మాత్రం ఇన్ చార్జ్ ను మార్చుతున్నారని అంటున్నారు. ఇన్ చార్జులు తమపై పెత్తనం చేస్తున్నారని.. తమ నియోజకవర్గాల్లో మరో పవర్ సెంటర్​గా మారుతున్నారని చెబుతున్నారు. అసంతృప్తులను చేరదీసి తమపైనే ఎగదోస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు కేసీఆర్, కేటీఆర్ ను కలిసి ఇన్ చార్జులను తీసెయ్యాలని కోరారు. అయితే ఆ ఇన్ చార్జులను మరో నియోజకవర్గానికి మార్చారు. 

ఖమ్మంలో నాలుగు చోట్ల మార్పు.. 

వైరా నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా మంత్రి పువ్వాడ అజయ్ కి బాధ్యతలు అప్పగించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములు నాయక్​ ఉండగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాజీ ఎమ్మెల్యే మదన్​ లాల్ కు దక్కింది. మదన్​లాల్ కు టికెట్ రావడంతో పువ్వాడ ఆయనను తీసుకుని వెళ్లి కేటీఆర్​ను కలిశారు. ఆ తర్వాత రోజు నుంచి మంత్రిని టార్గెట్ చేస్తూ రాములు నాయక్ విమర్శలు చేస్తున్నారు. ఇక మధిర, ఇల్లందు నియోజకవర్గాల్లో మొదట నియమించిన ఇన్ చార్జులు తమకు వద్దని అక్కడి అభ్యర్థులు మార్పించుకున్నారు. అప్పటి వరకు ఇల్లందు ఇన్ చార్జ్ గా ఉన్న నేతను పాలేరుకు మార్చే ప్రయత్నం చేయగా, అక్కడి ఎమ్మెల్యే కూడా ఒప్పుకోకపోవడంతో ఆయన్ను పక్కనపెట్టారు. భద్రాచలంలో కొత్త ఇన్ చార్జ్ ని నియమించగా, పాత వ్యక్తికే మళ్లీ బాధ్యతలివ్వాలంటూ స్థానిక నేతలు డిమాండ్​చేస్తున్నారు. అశ్వారావుపేటకు ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించగా, పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయనను తప్పించారు. కొత్తగూడెంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు, సత్తుపల్లిలో మరో రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డికి ఇన్​చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. 

నేతల మధ్య విభేదాలు.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​ లోకి వలసలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తన అనుచరులతో కలిసి పార్టీ మారగా.. ఇప్పుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే దారిలో ఉన్నారు. ఈ సమయంలో లీడర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కుతుండడం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహానికి కారణమవుతోంది. అందరూ ఏకతాటిపై ఉండి ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉండగా.. ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలతో రచ్చకెక్కుతున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కో స్థానంలోనే బీఆర్ఎస్​ గెలిచింది. ఇప్పటికైనా నేతలు విభేదాలను పక్కనపెట్టకపోతే వచ్చే ఎన్నికల్లోనూ పాత ఫలితాలే రిపీట్ అయ్యే ప్రమాదముందని పార్టీ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.