చనిపోయినోళ్లకు, రిటైర్‌‌‌‌ అయినోళ్లకు.. ‘స్థానిక’ ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ !

చనిపోయినోళ్లకు, రిటైర్‌‌‌‌ అయినోళ్లకు.. ‘స్థానిక’ ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ !
  • ఎన్నికల విధుల కేటాయింపులో ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • ఆరు నెలల కింద తీసుకున్న లిస్ట్‌‌తోనే డ్యూటీలు వేయడంతో గందరగోళం
  • సీనియర్లను పీవోలుగా, జూనియర్లను ఆర్‌‌వోలుగా నియమించడంపై ఆగ్రహం
  • దివ్యాంగులకు సైతం డ్యూటీలు కేటాయించిన ఆఫీసర్లు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల విధుల కేటాయింపులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నాలుగైదు నెలల కింద చనిపోయినోళ్లకు, రిటైర్‌‌‌‌ అయినోళ్లకు స్థానిక ఎన్నికల విధులు కేటాయించడమే కాకుండా... ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌పై వెళ్లిన టీచర్లకు పాత ప్లేస్‌‌‌‌లో డ్యూటీలు వేశారు. మరోవైపు సీనియర్లకు తక్కువ స్థాయి, జూనియర్లకు ఎక్కువ స్థాయి ఉన్న పోస్టులు కేటాయించారు. ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేసి చేతులు దులుపుకోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలల కింద రెడీ చేసిన లిస్ట్‌‌‌‌ను అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయకుండానే డ్యూటీలు కేటాయించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మచ్చుకు కొన్ని..
* అశ్వారావుపేట జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లో టీచర్‌‌‌‌గా పనిచేసిన చంద్రశేఖర్‌‌‌‌ ఇటీవలే చనిపోయారు. ఆయనకు సైతం ఎన్నికల డ్యూటీ వేయడం గమనార్హం.
* భద్రాద్రి జిల్లా పాండురంగాపురం హైస్కూల్‌‌‌‌లో గెజిటెడ్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎంగా పనిచేసిన ఉత్తరకుమారి ఐదు నెలల కిందే చనిపోయారు. ఈమెకు స్థానికల ఎన్నికల డ్యూటీ వేశారు. 
* దుబ్బతోగు, మామిళ్లగూడెంలో టీచర్లుగా పనిచేసిన సత్యవతి, కృష్ణకుమారి ఇటీవలే చనిపోయారు. అయినా ఎన్నికల విధుల్లో వీరి పేర్లను సైతం చేర్చారు.
* అశ్వారావుపేట జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎంగా పనిచేస్తూ నాలుగు నెలల కిందట రిటర్‌‌‌‌ అయిన వెంకయ్యకు, పాల్వంచ హైస్కూల్‌‌‌‌లో పనిచేస్తూ రిటైర్‌‌‌‌ అయిన పద్మజ పేర్లను డ్యూటీ లిస్ట్‌‌‌‌లో చేర్చారు.
* అశ్వారావుపేట నుంచి ఇల్లందుకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయిన నరేశ్‌‌‌‌కు, పాల్వంచ నుంచి ఇల్లందుకు బదిలీ అయిన ఇషాక్‌‌‌‌కు గతంలో పని చేసిన చోటే ఎన్నికల విధులు కేటాయించారు. 
* అన్నపురెడ్డిపల్లి నుంచి ప్రమోషన్‌‌‌‌పై అశ్వారావుపేటకు వెళ్లిన శ్రీనివాస్‌‌‌‌కు అన్నపురెడ్డిపల్లి నుంచే డ్యూటీ వేశారు.
* ఉసిర్లగూడెంలో కొర్స బాబూరావు, బండారుగుంపులో శ్రీను, తిరుమల కుంటలో వసంతతో పాటు పలువురు ఉద్యోగులు ఇతర చోట్లకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారు. కానీ వారు గతంలో పనిచేసిన ప్రాంతం నుంచే డ్యూటీలు వేయడంతో వారు అయోమయంలో పడ్డారు.
* ఎంఈఓగా పనిచేస్తున్న ఒకరికి పీఓగా డ్యూటీ వేసిన ఆఫీసర్లు.. ఆయన కంటే జూనియర్లు అయిన టీచర్లకు ఆర్‌‌‌‌వో, ఏఆర్‌‌‌‌వో డ్యూటీలు కేటాయించారు. ఇలా సీనియర్లను పీవోలుగా, జూనియర్లను ఆర్‌‌‌‌వోలుకు నియమించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* అశ్వారావుపేట జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లో పనిచేస్తున్న జ్యోతి, కొత్తనారం వారి గూడెంలో పనిచేస్తున్న సమత, కావడి గుండ్లలో పనిచేస్తున్న సంధ్యారాణికి పీఓ, ఓపీఓ, ఏపీఓగా మూడు డ్యూటీలు వేశారు. ఒకే ఉద్యోగికి మూడు విధులు కేటాయించడంతో ఎక్కడ, ఏ పని చేయాలో తెలియక గందరగోళం ఏర్పడింది.
* మెదక్‌‌‌‌ జిల్లా హవేలీ ఘనపూర్‌‌‌‌ మండలం కూచన్‌‌‌‌పల్లి జడ్పీ హైస్కూల్‌‌‌‌లో టీచర్‌‌‌‌గా పనిచేసిన భరత్‌‌‌‌ యాదవ్‌‌‌‌ జూనియర్ లెక్చరర్‌‌‌‌గా సంగారెడ్డి జిల్లాకు వెళ్లారు. ఆయనకు మెదక్‌‌‌‌ జిల్లాలో స్థానిక ఎన్నికల డ్యూటీ కేటాయించారు. 
* హవేలీ ఘనపూర్‌‌‌‌ మండలం బూరుగుపల్లి స్కూల్‌‌‌‌లో టీచర్‌‌‌‌గా పనిచేసిన శ్యామల ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌పై సిద్దిపేట జిల్లాకు వెళ్లారు. అయినా ఆమెకు పాత మండలంలోనే ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ కేటాయించారు.
* మెదక్‌‌‌‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌‌‌‌ ప్రైమరీ స్కూల్‌‌‌‌ హెడ్‌‌‌‌మాస్టర్‌‌‌‌ గోపాల్‌‌‌‌ రిటైర్‌‌‌‌ అయినప్పటికీ డ్యూటీ కేటాయించారు. ఇదే మండలం అప్పర్‌‌‌‌ ప్రైమరీ స్కూల్‌‌‌‌లో స్కూల్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తూ ప్రమోషన్‌‌‌‌పై జూనియర్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌గా వెళ్లిన మస్తాన్‌‌‌‌బాబాకు స్థానికంగానే డ్యూటీ కేటాయించారు.

దివ్యాంగుల ఇబ్బందులనూ పట్టించుకోలే..
స్థానిక ఎన్నికల డ్యూటీలు కేటాయించిన ఆఫీసర్లు దివ్యాంగ టీచర్ల కష్టాలను సైతం పట్టించుకోకుండా డ్యూటీలు వేశారు. ఎన్నికల డ్యూటీ నుంచి దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలనే ఆర్డర్స్‌‌‌‌ ఉన్నప్పటికీ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. 

కొందరు దివ్యాంగ టీచర్లు తమను ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయంచాలని ఎంఈవోలు, ఎంపీడీవోలను కలిస్తే జడ్పీ, డీపీవో ఆఫీసులకు వెళ్లాలని సూచించారని, అక్కడికి వెళ్తే కలెక్టర్‌‌‌‌ను కలవాలంటూ తిప్పుతున్నారని పలువురు వాపోయారు. కొన్ని స్కూల్స్‌‌‌‌లో టీచర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి నలుగురైదుగురు టీచర్లకు మాత్రమే డ్యూటీలు వేసి, మిగతా వారికి మినహాయింపు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారికి డ్యూటీలు కేటాయించి.. తమను మినహాయించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు కోరుతున్నారు.

విధుల నుంచి మినహాయించాలి 
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. వీరితో పాటు దివ్యాంగులను సైతం డ్యూటీ నుంచి మినహాయించాలి. సీనియర్, జూనియర్ల సమస్యలపై ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. ఈ విషయాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు సైతం వినతిపత్రాలు ఇచ్చాం.

ఎం. వెంకటేశ్వర్లు, యూటీఎఫ్​ జిల్లా ప్రధాన కార్యదర్శి

అన్నీ సరిచేస్తున్నాం
చనిపోయిన, రిటైర్‌‌‌‌ అయిన టీచర్లకు ఎన్నికల డ్యూటీలు పడినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రమోషన్లతో వెళ్లిన వారితో పాటు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయిన వారి వివరాలను తెలుసుకుంటున్నాం. మండల స్థాయి నుంచి వచ్చిన వివరాల ప్రకారమే డ్యూటీలు వేశాం. సీనియర్లకు పీవో డ్యూటీ పడినట్టుగా మా దృష్టికి తీసుకొస్తే మార్పులు చేస్తాం. దివ్యాంగులు కూడా డ్యూటీలు చేయాల్సి ఉంటుంది.

నాగలక్ష్మి, జడ్పీ సీఈవో, భద్రాద్రి కొత్తగూడెం