గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటదా? టీఎస్​పీఎస్సీ పరీక్షల నిర్వహణపై అయోమయం

గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటదా? టీఎస్​పీఎస్సీ పరీక్షల నిర్వహణపై అయోమయం
  • కమిషన్​ను ప్రక్షాళన చేసి ఏప్రిల్​ 1న నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్   
  • వచ్చే నెలలో గ్రూప్-2 పరీక్షకు కమిషన్ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్షల నిర్వహణపై అయోమయం  నెలకొన్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో పాటు ఎన్నికల హడావుడి కూడా తగ్గడంతో ఇటీవల వాయిదా వేసిన పలు పరీక్షలను నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి ప్రత్యేక చట్టంతో టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. 

ఫస్ట్ ఫేజ్ గ్రూప్-2 నోటిఫికేషన్ ఏప్రిల్1న.. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ డిసెంబర్15న విడుదల చేస్తామనీ హామీ ఇచ్చింది. అయితే, జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ తాజాగా కలెక్టర్లకు టీఎస్​పీఎస్సీ సెక్రటరీ లేఖ రాశారు. దీంతో టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన చేయకుండా, పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. అయితే, కొత్త సర్కారు కొలువుతీరగానే పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.   

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ హామీ  

రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది క్రితం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు దాదాపు ఐదున్నర లక్షల మంది అప్లై చేశారు. ముందుగా ఈ పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించినా.. అభ్యర్థుల ఆందోళనలతో నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఆ తేదీల్లో పరీక్షల నిర్వహణ కష్టమని జనవరి 6, 7 తేదీల్లో పెడ్తామని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, టీఎస్​పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు లీక్ కావడంతో పాటు రద్దు అయ్యాయి. 

మరికొన్ని పరీక్షలు వివిధ కారణాలతో వాయిదాపడ్డాయి. పరీక్షలను నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ ఫెయిల్ అయిందని, ఆ కమిషన్​ను రద్దు చేయాలని నిరుద్యోగులు ఆందోళనలు చేశారు. అయినా, ఏ ఒక్క అధికారిపైనా సర్కారు చర్యలు తీసుకోలేదు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతోపాటు జాబ్ క్యాలెండర్​నూ ప్రకటించింది. ఈ లెక్కన గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్1న నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకటి, రెండ్రోజుల్లో కొత్త సర్కారు కొలువు దీరనున్నది. త్వరలోనే కమిషన్ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం మొదలైంది. 

ప్రిపేర్ కావాల్నా? వద్దా? 

రీషెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్​పీఎస్సీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. పరీక్షల నిర్వహణకు సీసీ కెమెరాలున్న కాలేజీలు, స్కూళ్లల్లో సెంటర్లను ఏర్పాటు చేయాలని తాజాగా కలెక్టర్లకు టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ లేఖ రాశారు. పరీక్షలు జరిగే రెండు రోజులు సెలవులు ప్రకటించాలని సూచించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. నిన్నమొన్నటి దాకా చాలామంది నిరుద్యోగులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ కాలేదు. పరీక్ష ఏప్రిల్ లో ఉంటుందనే భావనతోనే ఉన్నారు. 

కానీ పరీక్షలు జనవరిలోనే పెడతామని కమిషన్ ప్రకటించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో, ఆ సర్కారు అనుమతి లేకుండానే టీఎస్ పీఎస్సీ అధికారులు పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్ పీఎస్సీ తీరుపై కొత్త సర్కారు ఎలా స్పందిస్తుందోనని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.