
పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. చివరి విడతలో ఒకేసారి 13 సీట్లకు పోలింగ్ జరగనుండడంతో పాలిటిక్స్ హైపిచ్ కు చేరుకున్నాయి. పంజాబ్ ప్రజలు తమవైపే ఉన్నారని గెలుపు ఖాయమన్నారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు. అనుకున్న స్థానాల్లో తమ పార్టీ గెలవకపోతే.. నైతిక బాధ్యత వహిస్తానన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించిందని చెప్పారు. ఓడిపోతే అందరూ బాధ్యత వహించాల్సిందేనని అమరీందర్ సింగ్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ 13 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్నారు పంజాబ్ సీఎం. గత లోక్ సభ ఎన్నికల్లో 13 లోక్ సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ కేవలం 3 సీట్లలోనే గెలిచింది. బీజేపీ 6, ఆప్ 4 స్థానాల్లో గెలిచాయి.
మరోవైపు తనకు అమృత్ సర్ స్థానం నుంచి టిక్కెట్ రాకుండా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అడ్డుకున్నారని, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఆరోపించారు. మహిళా కోటా గురించి మాట్లాడే వారు మహిళలకు గౌరవం ఇవ్వాలని, టిక్కెట్ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఈ విషయంపై స్పందించిన పంజాబ్ సీఎం.. నాన్ సెన్స్ అంటూ కొట్టిపడేశారు. అమరీందర్ సింగ్ వల్లే టిక్కెట్ రాలేదని తన భార్య చెప్పడాన్ని నమ్ముతున్నానని, ఆమె అబద్ధాలు ఎప్పుడూ చెప్పదన్నారు సిద్ధూ.