
ధర్మారం, వెలుగు: ధర్మారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లీడర్లు మంగళవారం ఘర్షణకు దిగారు. మండల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ ఇరు పార్టీల లీడర్లు సోమవారం సవాళ్లు విసురుకున్నారు. ఈక్రమంలో అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న ఇరు పార్టీలు లీడర్లు నినాదాలు చేస్తూ ఒకరిపైకొకరు దూసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పరిస్థితి అదుపుతప్పకుండా సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించారు. మరోవైపు మంగళవారం వారసంత ఉండడం, పెద్దఎత్తున జనం గుమికూడడంతో పాటు ఉద్రిక్తతతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులకు నచ్చజెప్పి పంపించివేశారు.