గుజరాత్ ఎన్నికలు : తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

గుజరాత్ ఎన్నికలు : తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్

గుజరాత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 43 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో మొదటి జాబితాను ఖరారు చేశారు.  తొలి జాబితాలో 10 మంది పటేల్, 11 మంది గిరిజనులు, 10 మంది ఓబీసీలు, ఐదుగురు ఎస్సీలు ఉన్నారు.

సీఎం భూపేంద్ర పటేల్ నియోజకవర్గమైన ఘట్లోడియా నుండి రాజ్యసభ ఎంపీ అమీబెన్ యాగ్నిక్‌ను పార్టీ బరిలోకి దింపింది. పార్టీ ప్రకటించిన 43 స్థానాల్లో ప్రస్తుతం దాహోద్ నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ అధీనంలో ఉంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భవేష్ కటారాకు బదులుగా మితేష్ గరాసియాకు పార్టీ టికెట్ కేటాయించింది. రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీని ఈ సారి గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1 మొదటిదశ,  డిసెంబర్ 5 రెండవ దశ ఎన్నికలు జరగనున్నాయి.  డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఆప్ 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, అధికార బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.