
- ఏఐసీసీ పరిశీలకుడిగా పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి
- ముఖ్య నేతల అభిప్రాయాల సేకరణ అనంతరం ఏఐసీసీకి లిస్ట్
నాగర్కర్నూల్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఏఐసీసీ పరిశీలకుడిగా పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి నియమితులయ్యారు. ఆయన సోమవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.
అనంతరం డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరించి ఐదుగురి పేర్లను ఏఐసీసీకి పంపించనున్నారు. పదేండ్లుగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులనే ఎంపిక చేయాలనే నిబంధనతో కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం లేకుండా పోయింది.
ఏడేండ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ..
అసెంబ్లీ ఎన్నికల వరకు నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పని చేశారు. ఆయనను పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించడంతో, డీసీసీఅధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. డీసీసీ అధ్యక్ష రేసులో కాయితి విజయకుమార్ రెడ్డి, రాము యాదవ్, కూచుకుళ్ల సుహాసన్ రెడ్డి, హబీబ్ పేర్లు వినిపిస్తున్నాయి. కొల్లాపూర్ నుంచి పార్టీ టికెట్ ఆశించిన జగదీశ్వర్ రావు తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని పట్టుబడుతున్నారు. తనకు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం తీసుకోలేదు. 20 ఏండ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి తాండ్ర ఉప సర్పంచ్‌గా పని చేశారు.
కూచుకుళ్ల సుహాసన్ రెడ్డి, ఎంపిటీసీ, పార్టీ మండల అధ్యక్షుడిగా పని చేశారు. రాము యాదవ్ పార్టీ పదవి నిర్వహించారు. హబీబ్‌కు వివాదరహితుడిగా పేరుంది. జిల్లా అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయిస్తే రాము యాదవ్‌కు అవకాశం ఉంటుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తి స్థాయిలో సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాయితి విజయ్ కుమార్ రెడ్డి, కూచుకుళ్ల సుహాసన్ రెడ్డి ఇద్దరూ సీఎంకు అనుచరులు. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసినా మంత్రి, ఎమ్యెల్యేలు ఆమోదం తెలుపుతారని భావిస్తున్నారు.
పార్టీ పదవుల భర్తీ స్పీడప్..
డీసీసీ అధ్యక్షుడిఎంపిక పూర్తయిన తరువాత ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర పదవులతో పాటు అనుబంధ విభాగాల ఎంపిక స్పీడప్ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని హైకమాండ్ ఆదేశించడంతో ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ప్రధానంగా నలుగురి పేర్లు..
నాగర్కర్నూల్డీసీసీఅధ్యక్ష పదవికి కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, బిజినేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కూచుకుళ్ల సుహాసన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి రాము యాదవ్, నాగర్ కర్నూల్‌కు చెందిన హబీబ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చివరి నిమిషంలో వేరే వారిని ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లో ఏఐసీసీ పరిశీలకుడు నారాయణ స్వామి డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం ఉదయం అచ్చంపేట, సాయంత్రం కొల్లాపూర్ లో పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.