బీఆర్ఎస్ హామీలు నమ్మి మోసపోవద్దు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బీఆర్ఎస్ హామీలు నమ్మి మోసపోవద్దు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌ హామీలు నమ్మి మోసపోవద్దని భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. శనివారం నల్గొండ పట్టణంలోని 18, 19, 42 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు,  నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్‌‌.. కొత్త హామీలతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.  దత్తత పేరుతో నల్గొండ ప్రజలకు ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిందని , అధికారంలోకి వచ్చాక సిద్దిపేట, సిరిసిల్లను మించి అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు.  100 రోజుల్లో ఆరు గ్యారంటీ  స్కీములను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు గడిగ హిమబిందు, రాములమ్మ, గణేష్, సూరెడ్డి సరస్వతి, ఏడు దొడ్ల వెంకటరామిరెడ్డి, నాగమణి, పాశం నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

నల్గొండ పట్టణంలోని 45వ వార్డుకు చెందిన మైనార్టీ నాయకుడు ఏఏ ఖాన్‌తో పాటు 48వ వార్డుకు చెందిన బీఆర్‌‌ఎస్ నేతలు మెట్టు శ్రీనివాస్ పాదం, అజయ్, రాజు వంశీ భాస్కర్‌‌తో పాటు తిప్పర్తి, కనగల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 600 మంది బీఆర్‌‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు శనివారం ఎంపీ కోమటి రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్‌లో చేరారు.  వీరితో పాటు రిటైర్డ్ ఆర్డీవో ప్రవీణ్ నాయక్, జీహెచ్‌ఎంసీ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ బుర్రి కృష్ణ శేఖర్, రిటైర్డ్ తహసీల్దార్లు తక్కెళ్ళ జంగయ్య, కత్తుల ఎల్లేశం కూడా పార్టీ కంపువా కప్పుకున్నారు.