వచ్చే ఏడాది ఎర్రకోటపై కాదు..ఇంట్లో జెండా ఎగురవేస్తారు: ఖర్గే

వచ్చే ఏడాది ఎర్రకోటపై కాదు..ఇంట్లో జెండా ఎగురవేస్తారు: ఖర్గే

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై కాకుండా.. తన ఇంటి వద్దే జెండా ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలుపొందడం ఖాయమని.. మళ్లీ ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని మోదీ చెప్పగా.. ఈ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ఎర్రకోటలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినో త్సవ వేడుకలకు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గైర్హాజరయ్యారు. ఖర్గే కోసం ఏర్పాటు చేసిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. 

ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ఆయన.. తన నివాసంతో పాటు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. హౌస్​లో తనను మాట్లాడనివ్వకుండా మైక్​ను మ్యూట్ పెట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ చేసిన 90 నిమిషాల ప్రసంగాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ.. కొన్నేండ్లుగా మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవేంటో చెప్పుకున్నారని తెలిపారు. దేశ నిర్మాణంలో గత ప్రధానులు అందించిన సహకారం ఎంతో గొప్పది అంటూ ప్రశంసించారు.