పంచాయతీరాజ్ సిస్టం ప్రాధాన్యాన్ని.. కాంగ్రెస్ 40 ఏండ్లు అర్థం చేస్కోలే

పంచాయతీరాజ్ సిస్టం ప్రాధాన్యాన్ని..  కాంగ్రెస్ 40 ఏండ్లు అర్థం చేస్కోలే
  •     హర్యానా క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్  ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ  
  •     కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 18 వేల ఊర్లు వెనకబడ్డాయని ఫైర్ 

చండీగఢ్:  స్వాతంత్ర్యం వచ్చిన నాలుగు దశాబ్దాల వరకు పంచాయతీ రాజ్  వ్యవస్థ ప్రాధాన్యాన్ని కాంగ్రెస్  పార్టీ అర్థం చేసుకోలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గ్రామాల్లో పంచాయతీ రాజ్  వ్యవస్థను అమలుపరచడం ఎంత ముఖ్యమో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదని ఆయన అన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్  జిల్లా సూరజ్ కుండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హర్యానా క్షేత్రీయ పంచాయతీ రాజ్  పరిషత్’ వర్క్ షాప్ ను సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి చెందిన ఇండియా కలను సాకారం చేసుకునేందుకు, ‘అమృత్  కాల్’  తీర్మానాలను నెరవేర్చుకునేందుకు దేశమంతా కలిసికట్టుగా ముందుకు పోతున్నదని పేర్కొన్నారు. ‘‘25 ఏండ్ల అమృత్  కాల్  జర్నీలో గత దశాబ్దాల అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి. డెవలప్డ్  ఇండియాకు దారి టైర్ 2, టైర్ 3 సిటీలు, గ్రామాల ద్వారానే వెళుతుంది. ప్రస్తుతం ఆ సిటీలు, గ్రామాలను ఆధునీకరిస్తున్నాం” అని ప్రధాని చెప్పారు. అనంతరం కాంగ్రెస్  పార్టీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తర్వాత కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా పంచాయతీ వ్యవస్థను కూడా కాంగ్రెస్  నడి సంద్రంలో ముంచిందని విమర్శించారు. స్వాతంత్ర్యం అనంతరం 70 ఏండ్ల వరకూ దేశంలోని 18 వేల గ్రామాలు రోడ్లు, విద్యుత్  వంటి సౌకర్యాలు లేక అలమటించాయన్నారు. 

నేను ఏదీ ఎన్నికల కోసం చేయను

తమ ప్రభుత్వం వచ్చాక గ్రామాల స్వరూపాన్ని మార్చామని మోదీ చెప్పారు. ప్రతి పథకంలోనూ అర్హులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘‘2019లో పీఎం కిసాన్  సమ్మాన్  నిధి పథకాన్ని ప్రారంభించినపుడు ఎన్నికల కోసమే ఆ పథకం ప్రారంభించారని మమ్మల్ని విమర్శించారు. కానీ, ఏ పథకాన్నీ మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించడు. నేను గ్యారంటీ ఇస్తే, అమలు చేస్తాను. పీఎం కిసాన్  సమ్మాన్  నిధి కింద రూ.2.60 లక్షల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్  చేశాం. ఇపుడు రైతులు రూ.300 కన్నా తక్కువకే బస్తా యూరియా పొందుతున్నారు. కొన్ని దేశాల్లో బస్తా యూరియా ధర రూ.3 వేలుగా ఉంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

అవినీతి, కుటుంబ రాజకీయాలను తరిమికొట్టాలి

అవినీతి, కుటంబ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలని ప్రధాని మోదీ మరోసారి పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత్  మండపంను ఆయన సందర్శించారు. దేశ చేనేత, ఖాదీ, టెక్స్ టైల్  పరిశ్రమలను వరల్డ్  చాంపియన్ గా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను వాడి దీనిని  మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.