ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్​ కౌన్సిలర్ల ఆందోళన

ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్​ కౌన్సిలర్ల ఆందోళన

జోగిపేట, వెలుగు : అందోల్‌‌–జోగిపేట మున్సిపాలిటీలోని డబుల్‌‌ బేడ్‌‌ రూమ్‌‌ ఇండ్ల పంపిణీ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్​ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో అధికారులకు, కాంగ్రెస్‌‌ కౌన్సిలర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని నిర్మించిన డబుల్‌‌ బెడ్​ రూమ్‌‌ ఇండ్ల  లబ్దిదారుల ఎంపికకు అధికారులు  శనివారం లాటరీ  నిర్వహించారు. అందోలులోని ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌లో ఆర్‌‌డీఓ అంబదాస్‌‌ రాజేశ్వర్, తహసీల్దార్‌‌ మధుకర్‌‌రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అందోలు, -జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జోగిపేటలో 252 ఇండ్లు, అందోలు వద్ద రెండు చోట్లలో 324 ఇండ్లను నిర్మించారు. వీటి కోసం 825 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో డబుల్‌‌ ఇండ్ల నిర్మాణం కోసం స్థలాన్ని అందజేసిన 39 మందికి ఇండ్లను కేటాయించి, మిగతా 537 ఇండ్లకే కేటాయించేందుకు 786 దరఖాస్తులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. 

కాంగ్రెస్​ కౌన్సిలర్ల ఆందోళన..

ముందస్తు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారంటూ కాంగ్రెస్‌‌ నాయకులు ఆర్డీఓ, తహసీల్దారులను నిలదీశారు. టీఆర్‌‌ఎస్‌‌ కౌన్సిలర్లకు సంబంధించిన బంధువులకు ఇండ్లు వచ్చాయని కౌన్సిలర్లు చిట్టిబాబు, హరికృష్ణాగౌడ్, మాజీ వైస్‌‌ చైర్మన్‌‌ రాములు ఆరోపించారు. ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలను ఇచ్చిన 39 మంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతనే డ్రాను ప్రారంభించాలని కౌన్సిలర్లు రంగ సురేష్, డి.శంకర్, మాజీ ఎంపీటీసీ డీజీ.వెంకటేశం, మాజీ వార్డు మెంబర్‌‌ పి.ప్రవీణ్‌‌ కుమార్‌‌లతో పాటు నాయకులు పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు అధికారులకు, కౌన్సిలర్లకు, నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆర్‌‌డీవో అంబదాస్‌‌ రాజేశ్వర్‌‌ చేసేది లేక జోగిపేట డబుల్‌‌ ఇండ్లలో 35 మందికి, అందోలు వద్ద నలుగురికి ఇండ్లను కేటాయించామని, వారి పేర్లను చదివి వినిపించారు. అనంతరం డ్రా ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు దుర్గేశ్​, చందర్, నాయకులు నాగరత్నం గౌడ్, ఉల్వల వేంకటేశం, లక్ష్మణ్, సంతోష్ తో పాటు తదితరులు ఉన్నారు. ఇండ్ల ఎంపిక ప్రక్రియ అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్  ప్రకటించారు. 

జాతీయ రహదారిపై.. 

ఇండ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌‌ పార్టీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. కేసీఆర్‌‌ డౌన్‌‌ డౌన్‌‌ అంటూ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైవేపై భారీ ట్రాఫిక్​ జామ్​ జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని రోడ్డుపై నుంచి లేపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.