26న చేవెళ్ల సభలో కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్

26న చేవెళ్ల సభలో కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్

న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 26న జరిగే బహిరంగ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్‌‌‌‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటిస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణకు చెందిన దళిత, గిరిజన నేతలు ఆదివారం ఖర్గేతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాజాజీ మార్గ్ 10లో జరిగిన ఈ భేటీలో భట్టి విక్రమార్క, సీతక్క, సంపత్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, బలరాం నాయక్, గడ్డం వినోద్, రాములు నాయక్, మల్లు రవిలతో పాటు దాదాపు 25 మంది నేతలు పాల్గొన్నారు. గంటన్నర సాగిన ఈ భేటీలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వ్​డ్​ స్థానాల్లో పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురి నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను ఖర్గే స్వీకరించినట్లు తెలిసింది.

ప్రధానంగా భట్టి, సీతక్క, సంపత్‌‌‌‌ తెలంగాణలోని తాజా పరిస్థితులు, ఆయా వర్గాలకు సంబంధించిన పలు అంశాలను ఖర్గేకి వివరించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ, చేవెళ్ల బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సభలో దళిత, గిరిజన అంశాలపై డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తాము సేకరించిన కొన్ని అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైనా చర్చించామన్నారు. దీనికి సంబంధించిన అన్ని అంశాలను చేవెళ్ల సభలో ఖర్గే ప్రకటిస్తారని భట్టి వెల్లడించారు. అనంతరం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వీర్ భూమిలోని రాజీవ్ స్మారకం వద్ద భట్టి నివాళి అర్పించారు.