
- దళిత మంత్రులకు బహిరంగ క్షమాపణకు చెప్పాలి
- ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్కార్యకర్తలు
దుబ్బాక, వెలుగు: దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దుబ్బాకలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకట్స్వామిని వాడు వీడంటూ మాట్లాడడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. గడ్డం, దామోదర కుటుంబాలు దేశం, రాష్ట్రాల అభివృద్ధికి పాటు పడ్డాయని, తెలంగాణ ఏర్పాటులో ఇరు కుటుంబాలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు.
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే ఎమ్మెల్యేకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మంత్రులుగా ఎదిగితే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. దళితుల పట్ల మీకున్న వంకర బుద్ధి మెదక్‌లో జరిగిన రైతు దీక్షలో తేటతెల్లమైందన్నారు. దళిత మంత్రులకు ప్రజల్లో వస్తోన్న ఆదరాభిమానాలను ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. దళిత మంత్రులను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవి, ఏసు రెడ్డి, నరేశ్, శంకర్, రాజిరెడ్డి, శ్రీనివాస్, భరత్, శ్రీనివాస్‌గౌడ్, సురేశ్, పద్మయ్య, కమలాకర్ పాల్గొన్నారు.