ఆదిలాబాద్‌‌‌‌ విజయంపై ..కాంగ్రెస్‌‌‌‌ కన్ను

ఆదిలాబాద్‌‌‌‌ విజయంపై ..కాంగ్రెస్‌‌‌‌ కన్ను
  •     నియోజకవర్గంపై మంత్రి సీతక్క ఫోకస్‌‌‌‌
  •     ఆదివాసీ నేతలతో మంతనాలు, సమస్యల పరిష్కారానికి హామీలు
  •     కాంగ్రెస్‌‌‌‌లోకి పెరిగిన వలసలు
  •     నేడు కాంగ్రెస్‌‌‌‌ బహిరంగ సభ, హాజరుకానున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు : తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో కాంగ్రెస్‌‌‌‌ పూర్వ వైభవం సాధించే దిశగా దూసుకెళ్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో సైతం భారీ విజయం సాధించే దిశగా ఆ పార్టీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వైపు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి హామీలు ఇస్తూనే మరో వైపు చేరికలపై ఫోకస్‌‌‌‌ పెట్టారు. అలాగే సోమవారం జరగనున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆదిలాబాద్‌‌‌‌పై మంత్రి సీతక్క ఫోకస్‌‌‌‌

ఆదిలాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి సీతక్క నియోజకవర్గంపై ఫుల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ టైం ఇక్కడే ఉంటూ జిల్లా మొత్తం చుట్టేస్తున్నారు. ఆదివాసీ గూడెలు, తండాల్లో మూడు నెలల నుంచి విస్త్రతంగా పర్యటిస్తున్న మంత్రి సీతక్క ఆయా ప్రాంతాలపై పట్టు సాధించారు. బీఆర్ఎస్‌‌‌‌ హయాంలో వెనుకబడ్డ ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు.

 ఆదివాసీ నేతలను సైతం కలుస్తూ కాంగ్రెస్‌‌‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ ఆత్రం సుగుణకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఆదివాసీ గూడెల్లో తాగునీరు, కరెంట్, రోడ్లు, వైద్య సదుపాయం లేదని గతంలో పలువురు ఆదివాసీ నేతలు మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు. దీంతో పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సీతక్క ఆదివాసీ నేతలకు హామీ ఇస్తున్నారు. 

కాంగ్రెస్‌‌‌‌ విజయంపై లీడర్ల ధీమా

ఆదిలాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గంలో మొదటిసారి ఓ ఆదివాసీ మహిళను కాంగ్రెస్‌‌‌‌ బరిలో దింపింది. అలాగే ఆమెను గెలిపించే బాధ్యతను సైతం మరో మహిళ, మంత్రి సీతక్క చేతిలో పెట్టడం కాంగ్రెస్‌‌‌‌కు కలిసొచ్చే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గ పరిధిలో ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌‌‌‌లో చేర్చుకునే ప్రక్రియను స్పీడప్‌‌‌‌ చేశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలహీనపడడంతో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌‌‌‌లు ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌లో చేరిపోయారు.

 దీంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఓటు బ్యాంక్‌‌‌‌ మొత్తం కాంగ్రెస్‌‌‌‌ వైపు మళ్లింది. ఇందులో ముఖ్యంగా ఆదివాసీ సామాజికవర్గంతో పాటు మైనార్టీ వర్గాలు సైతం కాంగ్రెస్‌‌‌‌కే అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి తోడు బీజేపీలో ఉన్న అంతర్గత కలహాలు కాంగ్రెస్‌‌‌‌కు కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ నుంచి రోజుకొకరు చొప్పున పార్టీ వీడడంతో పాటు బీజేపీ క్యాండిడేట్‌‌‌‌ ఎంపికపై అసంతృప్తిగా ఉన్న నేతలు సైలెంట్‌‌‌‌ కావడంతో ఆ ప్రభావం ప్రచారంపై కనిపిస్తోంది. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్‌‌‌‌కే కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

నేడు ఆదిలాబాద్‌‌‌‌లో సీఎం ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి రానున్నారు. ఆ పార్టీ క్యాండిడేట్‌‌‌‌ ఆత్రం సుగుణ నామినేషన్‌‌‌‌ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డైట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లీడర్లు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరధిలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో జనాలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం సభ విజయవంతం చేయడం పట్ల కార్యకర్తలకు హైకమాండ్‌‌‌‌ ఇప్పటికే దిశా నిర్దేశం చేసింది. నియోజకవర్గంలోని ప్రతి బూత్‌‌‌‌ నుంచి జనాలను తరలించేందుకు మండలాల లీడర్లకు ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మందిని తరలించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నారు.