తెలంగాణ బీసీ బిల్లులను  బీజేపీ అడ్డుకుంటున్నది : జైరాం రమేశ్

తెలంగాణ బీసీ బిల్లులను  బీజేపీ అడ్డుకుంటున్నది : జైరాం రమేశ్
  • నాడు బిహార్ బిల్లులకు 10 రోజుల్లో గవర్నర్ ఆమోదం 
  • తెలంగాణ బిల్లులను రాష్ట్రపతికి పంపడంలో మతలబేంటి?
  • కేంద్ర ప్రభుత్వంపై జైరాం రమేశ్ ఫైర్‌‌‌‌ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘‘నాడు ఈబీసీ రిజర్వేషన్లను పెంచుతూ బిహార్ తెచ్చిన బిల్లుకు గవర్నర్ 10 రోజుల్లోనే ఆమోదం తెలిపారు. కానీ తెలంగాణ బీసీ బిల్లులకు మాత్రం కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నది. వీటిని ఆమోదించే అధికారం గవర్నర్‌‌‌‌కు ఉన్నా రాష్ట్రపతికి పంపించడంలో మతలబేంటి?” అని ప్రశ్నించారు. తెలంగాణలోని బీసీ బిడ్డలకు రిజర్వేషన్లు అందకుండా బీజేపీ ఉద్దే్శపూర్వకంగానే బిల్లులను ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో జైరాం రమేశ్ పోస్టు పెట్టారు.

‘‘బిహార్‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ 2023 నవంబర్ 9న ఆ రాష్ట్ర అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది. దాన్ని తర్వాత రోజే కౌన్సిల్ కూడా ఆమోదించింది. ఈ బిల్లుకు కేవలం 10 రోజుల్లో గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో నవంబర్ 21న చట్టంగా మారింది” అని పోస్టులో వెల్లడించారు.  

నాలుగు నెలలుగా పెండింగ్.. 

బిహార్ బిల్లుకు గవర్నర్ 10 రోజుల్లో ఆమోదం తెలిపారని, మరి తెలంగాణ బిల్లులకు నాలుగు నెలలు గడిచినా ఎందుకు మోక్షం లభించడం లేదని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 67 శాతానికి (ఇందులో 42% బీసీ కోటా) పెంచుతూ 2025 మార్చి 17న రాష్ట్ర అసెంబ్లీ బిల్లులను ఆమోదించింది. మరుసటి రోజే కౌన్సిల్ కూడా ఆమోదించింది. అయితే గవర్నర్ ఆ బిల్లులను మార్చి 30న రాష్ట్రపతికి పంపారు. నాలుగు నెలలైనా రాష్ట్రపతి నుంచి ఎలాంటి సమాధానం లేదు. బిహార్‌‌‌‌లో బీసీ బిల్లు తెచ్చినప్పుడు అక్కడ ఎన్డీయే అధికారంలో లేదు.

నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఆర్జేడీ, ఐఎన్సీ కూటమి అధికారంలో ఉంది. అయితే బిహార్‌‌‌‌లోని సామాజిక వాస్తవాల దృష్ట్యా ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆ బిల్లు విషయంలో ఆలస్యం చేయించడం, అడ్డుకోవడం బీజేపీకి సాధ్యం కాలేదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నది” అని మండిపడ్డారు. సామాజిక న్యాయంపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. బీజేపీ అడ్డుకోకపోతే నాలుగు నెలలుగా రాష్ట్రపతి వద్ద బిల్లులు ఎందుకు పెండింగ్‌‌లో ఉంటాయని ప్రశ్నించారు.