హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్.. బల్దియా అధికారులతో ఇన్​చార్జి మంత్రి పొన్నం రివ్యూ

హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్..  బల్దియా అధికారులతో ఇన్​చార్జి మంత్రి పొన్నం రివ్యూ
  •     రేపు లేదా ఎల్లుండి చర్చలు  
  •     కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరగనున్న తొలి సమావేశం

హైదరాబాద్, వెలుగు : సిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 27 లేదా 28న బల్దియాపై రివ్యూ నిర్వహించనున్నారు. గురువారమే ఈ రివ్యూ జరగాల్సి ఉండగా కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ మీటింగ్​తో పోస్ట్ పోన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిటీ అభివృద్ధిపై నిర్వహించే తొలి సమావేశం ఇదే కానుంది. అయితే.. బల్దియా ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో రివ్యూ మీటింగ్ ఉంటుందని రెడీగా ఉండగా.. ముందుగా మంత్రి నిర్వహిస్తున్నారు.

కమిషనర్ సహా అధికారులంతా గ్రేటర్ సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని వివరాలతో  సిద్ధంగా ఉన్నారు.బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటితో పాటు భవిష్యత్​లో చేపట్టేందుకు తీసుకున్న నిర్ణయాలు వంటి వాటిపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.  బల్దియా ఉన్నతాధికారులతో ఇదివరకే  సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇప్పుడు మంత్రి రివ్యూ నిర్వహిస్తుండగా.. అభివృద్ధిపై ఏం చర్చిస్తారనేది అంతటా చర్చనీయాంశమైంది.  

వీటిపైనే చర్చ.. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్(ఎస్​ఆర్డీపీ) ఫస్ట్​ ఫేజ్​లో భాగంగా రూ.5,937 కోట్లతో మొత్తం 47 పనులు చేపట్టారు. ఇందులో కొన్ని పనులు పెండింగ్​లో ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కోసం రూ.4,300  కోట్లతో 36 పనులకు పర్మిషన్లు ఇస్తున్నామని ప్రకటించారు. అయితే, ఆలోపే  బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. అదేవిధంగా వరదల నివారణకు ఫస్ట్ ఫేజ్ కింద రూ. 737.45 కోట్లతో  37 నాలా పనులు చేపట్టారు.

ఇందులో ఇంకా 6 పనులు నడుస్తున్నాయి. రెండేండ్ల కిందట పనులు ప్రారంభించిన వెంటనే  మరో రూ.వెయ్యి కోట్లతో దాదాపు 70 నాలాల పనులు చేపట్టాలని సెకండ్ ఫేజ్ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు. ఎస్​ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్​కు  సంబంధించిన జీవోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక పనులు స్టార్ట్ అవుతాయని అనుకోగా.. ఆ లోపే ఎన్నికలు రావడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. వీటితో పాటు  మిగతా పనులపై కూడా రివ్యూలో చర్చకు రానుంది. 

రివ్యూ తర్వాతే క్లారిటీ 

బల్దియా చేపట్టిన పనులతో పాటు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులపై కూడా ఇన్​చార్జి మంత్రి చర్చించే చాన్స్ ఉంది.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిగులు బడ్జెట్​తో ఉన్న బల్దియాను 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రూ.6 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టింది. వాటికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వంనుంచి రావాల్సిన బకాయిలపైనా మేయర్​, కమిషనర్ నోరు విప్పలేకపోయారు. దీంతో ఉద్యోగులకు సైతం జీతాలు టైంకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ రివ్యూలో దీనిపై చర్చించే అవకాశం ఉంది.బల్దియాకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చులపైనా ఆరా తీయనున్నారు. స్పెషల్ ఫండ్స్ ఏమైనా ఇచ్చి ఆదుకుంటారా.. అని అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం తర్వాతనే గ్రేటర్​లో ఏయే పనులు ముందుకు సాగుతాయన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ రివ్యూ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఓ సమావేశం ఏర్పాటు చేసి  ఇక్కడ తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నట్లు సమాచారం.