సంగారెడ్డి క్రషర్లపై సర్కార్ ఫోకస్

సంగారెడ్డి క్రషర్లపై సర్కార్ ఫోకస్
  •      పటాన్ చెరు క్రషర్​ కేంద్రాలపై సీఎస్ఐ పోలీసులు, మైనింగ్  ఆఫీసర్ల దాడులు
  •     ఆర్థిక లావాదేవీలు, పన్నుల ఎగవేతపై ఆరా
  •     సమగ్ర విచారణకు ఆదేశం
  •     భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
  •     అజ్ఞాతంలో క్రషర్ల ఓనర్లు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరుగుతున్న అక్రమ క్రషర్ల దందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నాలుగైదు రోజులుగా లక్డారంలో నిర్వహిస్తున్న అక్రమ క్రషర్లపై పోలీస్, అధికారుల స్పెషల్ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. అడ్డగోలు తవ్వకాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తూ పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను (జిలెటిన్ స్టిక్స్) స్వాధీనం చేసుకున్నారు.

వెన్ సాయి మెటల్స్, పీఎమ్ ఆర్ క్వారీలపై దాడులు నిర్వహించి 800 జిలెటిన్ స్టిక్స్, 35 డిటోనేటర్లు, 180 ఐడియన్ బూస్టర్లు, 1,375 ఎలెక్ట్రిక్ డిటోనేటర్లు, 375 డిటానేటరింగ్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. క్రషర్ ఇన్‌చార్జి రాధాకృష్ణ, బ్లాస్టర్ లింగస్వామి, సూపర్ వైజర్ సుబ్బారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  వీరిపై ఎక్స్​ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో క్రషర్ల ఓనర్లు పరారీలో ఉన్నట్టు సమాచారం. 

అక్రమ దందా

పటాన్ చెరు పరిధిలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. లక్డారం గ్రామ పరిధిలో ఒకేచోట 42 క్రషర్లు నడుస్తున్నాయి. అక్రమ తవ్వకాల నుంచి మొదలుపెట్టి పక్కన ఉన్న ఇతర భూములను కబ్జా చేస్తూ మైనింగ్ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. తప్పుడు లెక్కలతో పన్నులు ఎగవేస్తూ అనుమతులు లేకుండా మైనింగ్, హెవీ లోడింగ్​ చేస్తూ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెంచి స్థానికులను ఇబ్బంది పెడుతున్నారు.

నిషేధిత పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో దుమ్ము ధూళి పేరుకుపోయి పంట పొలాలు పాడవుతున్నాయి. ప్రజలు శ్వాశకోశసమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమ మైనింగ్ కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్డారం బాధిత రైతులు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ  పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పెద్ద చెరువుకు ప్రమాదం

పెద్ద చెరువుకు 100 మీటర్ల దూరంలో కేఎస్ఆర్ క్వారీకి పర్మిషన్ ఇవ్వడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కింద 3 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. సుమారు 600 మంది రైతులు ఈ చెరువునే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామ పరిధిలో ఇప్పటికే ఉన్న క్రషర్ల వల్ల ఇండ్లు బీటలు వారుతుండగా మరో కంకర క్వారీని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన రైతులు అప్పట్లో నిరవధిక దీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం పటాన్ చెరు అక్రమ క్రషర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఈ క్రషర్లలో ఎక్కువగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, స్థానిక లీడర్లకు చెందినవి కావడంతో ఇప్పటివరకు ఎగవేసిన పన్నుల వివరాలు, మోతాదుకు మించిన మైనింగ్ పై పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఈ విషయమై గత వారం రోజులుగా స్పెషల్ బృందాలు ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. లక్డారం క్రషర్లపై దృష్టి పెట్టిన అధికారులు ఓ ప్రముఖ లీడర్ కు చెందిన క్రషర్ నుంచి రెగ్యులర్ గా రోబో సాండ్ తరలిస్తున్నట్టు గుర్తించారు. సదరు లీడర్ ఇంతకాలం పాత బిల్లులు చూపించి అక్రమ క్రషింగ్ తోపాటు రోబో సాండ్ రవాణా చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవు 

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న క్రషర్లపై తనిఖీలు చేస్తున్నాం. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరిని పట్టుకొని విచారిస్తున్నాం. త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయి. మిగతా క్వారీల విషయంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు పర్మిషన్లు ఇచ్చాం. 
మధుకుమార్, (మైనింగ్ ఏడీ).