సర్కార్ ​కార్పొరేషన్లతో ఆగమాగం

సర్కార్ ​కార్పొరేషన్లతో ఆగమాగం

కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం, వారికి అవసరమైన అనుకూల విధానాల కోసం అనేక అడ్డదారులు తొక్కడం మనకు విదితమే. అయితే దీనివెనుక ఇంకొక బాగోతం ఉన్నది. అది ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల పాలన. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్లను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేశారు. గత పదేండ్లలో ఏర్పాటు చేసినవి చాలా ఎక్కువ. ఇప్పటికి 70కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. సాధారణంగా ఈ కార్పొరేషన్లు కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఇటువంటి కంపెనీలో డైరెక్టర్లు సాధారణంగా ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉంటారు.  కాగ్ సంస్థ అప్పడప్పుడూ కొన్ని ప్రభుత్వ సంస్థల మీద ఆడిట్ చేసినా లోతుల్లోకి పోతున్న దాఖలాలు లేవు. దరిమిలా తొందరపాటు నిర్ణయాలు, అవినీతి, దుబారా ఖర్చులు ఈ ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల ద్వారా సాధ్యం అవుతున్నాయి.

కాగ్ నివేదిక ప్రకారం దాదాపు 45 జాతీయ స్థాయి కంపెనీల్లో ‘ఆడిట్’ కమిటీ లేదు. స్వతంత్ర డైరెక్టర్లు లేరు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే మేము ప్రభుత్వం కాదు అంటారు. దాదాపు అన్ని కంపెనీలకు ఐఏఎస్ అధికారులే అధిపతులు. కొన్నింటికి చైర్మన్లుగా రాజకీయ నాయకులను నియమించినా వారికి ఈ ‘కార్పొరేట్’ వ్యవస్థ మీద అవగాహన లేదు. తమకిచ్చిన ‘సౌకర్యాలను’ వాడుకోవడం తప్పితే ‘ఈ రకం ప్రజా ప్రతినిధులు’ ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడిన సందర్భాలు చాలా తక్కువ. అనూహ్యంగా ఈ మధ్య వివిధ ‘కులాలకు’ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఆయా కులాల నాయకులను ‘సంతృప్తి’ పరచడానికే ఇవి ఏర్పాటు చేస్తున్నారు.  అంతేగానీ ఆ కులాలకు చెందిన ప్రజల బాగోగుల కోసం, వారి అభివృద్ధి కోసం లేదా వారి సమస్యల పరిష్కారం కోసం ఇవి ఏర్పాటు చేయడం లేదు. ‘కులాల’ పేరిట భవనాలు కట్టి, ఈ ప్రభుత్వం కంపెనీలకు అప్పజెప్పిన సరికొత్త పాలన  సంప్రదాయం గత తెలంగాణ ప్రభుత్వం పాటించింది.  

పదవుల పందేరం

కార్పొరేషన్లు కొందరికి పదవి ఇవ్వడానికి ఏర్పాటు కాగా, ఇంకొన్ని ప్రభుత్వానికి అప్పులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ శ్వేతపత్రం ప్రకారం ఈ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు రూ.2,82,084 కోట్లు.  మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పులో ఇది 42 శాతం. ఇందులో ప్రభుత్వం హామీ ఇచ్చి, తీర్చబోయే అప్పులు రూ.1,27,208 కోట్లు కాగా, ప్రభుత్వ హామీల మేరకు అప్పులు తీసుకుని వాటి బాధ్యత కార్పొరేషన్ల మీద ఉన్న అప్పులు రూ.95,462 కోట్లు.  కార్పొరేషన్లు స్వయంగా అప్పు చేసి, తామే తీర్చే అప్పులు రూ.59,414 కోట్లు.  ప్రభుత్వం హామీ ఉండి, ప్రభుత్వమే అప్పు తీర్చే బాధ్యత తీసుకున్న అప్పులలో 86 శాతం (రూ.1.5 లక్షల కోట్లు) ‘నీటి’ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవే. దాదాపు రూ.9 వేల కోట్లు హౌసింగ్ కార్పొరేషన్ పేరిట తీసుకున్నారు. గొర్రెల కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొర్రెల పథకం కోసం రూ.4 వేల కోట్లు అప్పు, చేపల కోసం రూ.600 కోట్లు, హాస్పిటల్ నిర్మాణాల కోసం రూ.3,535 కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వం హామీగా ఉండి అప్పులు తీర్చే బాధ్యత తీసుకున్న కార్పొరేషన్లలో 59 శాతం వాటా పౌర సరఫరాల కార్పొరేషన్ ది. ఇంకొక 32 శాతం కరెంటు కంపెనీలది (డిస్కంలు). గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న రూ.4,930 కోట్లు, తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ తీసుకున్న రూ.1,825 కోట్లు తీర్చాలంటే ఆయా సంస్థలు తమ ఆస్తులు అమ్ముకోవాలి. లేదా తమ ‘సేవల’ రేట్లు పెంచాలి. 

ప్రాజెక్టుల నీరు పక్కదారి

హైదరాబాద్ జలమండలిని 1989లో ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాలంలో ఈ ప్రభుత్వ కంపెనీ ద్వారా నీటి వినియోగానికి నిర్ణయించే రేట్లు ప్రతి సంవత్సరం సమీక్షించి ఎప్పటికప్పుడు ఖర్చులకు అనుగుణంగా పెంచాలని భావించారు. ఈ విధమైన ఏర్పాటు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. హైదరాబాద్ జల మండలి పూర్తిగా నగర ప్రజల అవసరాల మేరకు మంచి నీరు అందించడంలో, మురికి నీటి వ్యవస్థ ఏర్పాటులో ఆశించిన మేరకు సంతృప్తికరంగా  లేదు. ఈ కంపెనీ నీటి ‘వ్యాపారం’ లోటులో నడుస్తున్నది. అటువంటి పరిస్థితిలో రాష్ట్రవ్యాప్తంగా  సాగునీరు, తాగునీటిని అందించడానికి ఏర్పాటు చేసిన కొత్త సంస్థలు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ల ద్వారా రూ.1,15,320 కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు తీర్చాలంటే ‘నీటికి’ ధర కట్టాల్సిందే. అందుకని రిజర్వాయర్లకు దగ్గరగా నీటి అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. ప్రాజెక్టులు కట్టేది వ్యవసాయం కోసం, ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి. కానీ, క్రమంగా ఆ నీరు పక్కదారి పడుతున్నది. కష్టపడి తెచ్చిన నీటిని ఆయా పరిశ్రమలు కలుషితం చేస్తున్న పరిస్థితులలో అసలు లక్ష్యం నెరవేరకుండానే భారీ అప్పు, నిర్వహణ భారం ప్రజల మీద పడుతున్నది. సంప్రదింపులు లేకుండా ‘వ్యాపార’ వర్గాలు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు ఇచ్చే సలహాలు పట్టుకుని ప్రాజెక్టులు కడితే పరిణా
మాలు ఇట్లానే ఉంటాయి.

కార్పొరేషన్ల అప్పులు ప్రభుత్వమే కట్టాలి

వాస్తవిక పరిస్థితులను విశ్లేషిస్తే మనకు ఈ కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రధానంగా 6 లక్ష్యాలు కనపడుతున్నాయి: 1. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి, 2. శాసనసభ పర్యవేక్షణ లేకుండా అప్పులు చేయడానికి, 3. పర్యవేక్షణ లేకుండా ప్రజల సొమ్ము ఖర్చు చేయడానికి, 4. కార్పొరేషన్ పదవుల ద్వారా అస్మదీయులకు ‘అందలం’ ఎక్కిస్తున్న భ్రమ కల్పించడానికి, 5. ప్రభుత్వ పాలనలో ఉన్న ‘సంకెళ్లు’ (నిబంధనలు, విధి విధానాలు) నుంచి బయటపడడానికి, 6. కాంట్రాక్ట్ టెండర్లు ఇష్టానుసారం ఇచ్చే వెసులుబాటు. ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.  కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు ఏతావాతా ప్రభుత్వమే కట్టాలి. దానికోసం భూములు అమ్మడం, వస్తు సేవల ధరలు పెంచడం, పన్నులు పెంచడం మినహా వేరే గత్యంతరం లేదు.  ప్రకృతి వనరులైన భూమి, నీరు అందరికి అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అప్పుల బారిన పడి ఈ వనరులను ‘వ్యాపార’ వస్తువులుగా మార్చాల్సి వస్తున్న వైనం మనం గమనించాలి.

వ్యాపార సంస్థలా టీఎస్ఐఐసీ

2014–-15 నుంచి 2023-–24 మధ్య ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 12,24,877 కోట్లు. చేసిన అప్పుతో కలిపితే  దాదాపు 19 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది గత ప్రభుత్వం. ఈ కోట్ల ఖర్చు వల్ల ఎందరి జీవితాలు బాగుపడినాయి? తెలంగాణాలో జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగినాయి?. ప్రభుత్వ ఆస్తులను ఒక కంపెనీకి మార్చే  ప్రక్రియ మీద కోర్టులు ఇప్పటివరకూ స్పందించలేదు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఈ కంపెనీల పేరు మీద మార్చే ప్రక్రియ కూడా పారదర్శకంగా లేదు. తెలంగాణ స్టేట్​ఇండస్ర్టియల్​ఇన్​ఫ్రాస్ట్రక్టర్​ కార్పొరేషన్​( టీఎస్ఐఐసీ) పేరు మీద భూమి మార్చారు, మారుస్తున్నారు. అది ఒక ఫక్తు వ్యాపార సంస్థలా పని చేస్తున్నది. ఈ మధ్య పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే కంపెనీలే కాక,  ప్రభుత్వ–-ప్రైవేటు భాగస్వామ్యంలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరిట ఉమ్మడి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు.  మన దేశ ప్రజాస్వామ్య  ప్రభుత్వ పాలనలో కంపెనీలు, కార్పొరేషన్ల పాత్రను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఆదాయం కోసం సర్కారు వేట

అప్పుల భారం వల్ల కొత్త ప్రభుత్వం ‘ఆదాయం’ వేటలో పడాల్సి వచ్చింది. ఉపాధి పెంచే ఆర్థిక ప్రణాళిక పక్కదారి పడుతున్నది. సామాజిక లక్ష్యాలు వెనుకపడి ‘రెవెన్యూ’ పెంచే మార్గాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆదాయం కోసం పెట్టుబడిదారుల మీద, వ్యాపారాల మీద, బహుళ జాతి కంపెనీల సలహాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. రైతులు అప్పులు చేసి తిరిగి కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే,  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పిస్తున్న నేపథ్యంలో కొందరు నాయకులు రైతులు పరిహారం కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ప్రకటించడం గర్హనీయం.  రైతులు ఆర్భాటంగా పెండ్లిలకు, పండుగలకు, పబ్బాలకు అప్పులు తీసుకుంటున్నారు అని ఆరోపించిన రాజకీయ నాయకత్వం మరి ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న అప్పుల నియంత్రణకు ఎందుకు నడుం కట్టడం లేదు. ప్రభుత్వానికి ఉన్న ఆదాయం పరిమితులలో ‘అభివృద్ధి’ పనులు చేయకుండా అప్పులు చేసింది గత ప్రభుత్వం.  మరి, ప్రభుత్వ ఆదాయం దేనిమీద ఖర్చు పెట్టారు?.

ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరం

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు మొదలైన ఈ సరికొత్త కార్పొరేషన్ పాలన, ఆశ్చర్యంగా తెలంగాణ ఏర్పడినాక కూడా కొనసాగింది. తెలంగాణా అస్తిత్వం కోసం పోరాడిన ఉద్యమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది ఉధృతం అవ్వడం యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ, ప్రకృతి వనరుల వినియోగాన్ని ప్రైవేటువ్యవస్థలకు అప్పగించే క్రమం మొదలయ్యింది.  బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రైవేటీకరణను నమ్ముకుని కార్పొరేషన్ల ద్వారా ‘పాలన’ చేసింది. ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటుకు మన దేశ పాలనా వ్యవస్థలో ఒక ‘అనుమతుల ప్రక్రియ’ లేకపోవడం పాలకులకు ఓ అవకాశంగా పరిణమించింది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్ ఎట్లా ఏర్పాటు చెయ్యాలి, దాని విధి విధానాలు ఎలా ఉండాలి వంటి విషయాల మీద ఎక్కడా నిబంధనలు, మార్గదర్శకాలు లేవు. శాసనసభ అనుమతి కూడా అవసరం లేదు. ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు దఖలుపరచడానికి ప్రభుత్వం కార్పొరేషన్లను ఒక ‘వారధిగా’, ఒక ‘అస్త్రంగా’ ఉపయోగిస్తున్నారు. 

- దొంతి నరసింహారెడ్డి..  పాలసీ ఎనలిస్ట్