తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం
  • రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు 
  • ప్రతిపక్ష నేతలకూ సర్కార్ ఆహ్వానం 
  • కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్ 
  • కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత పదేండ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని, రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్​ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖ పంపించారు. 

మరోవైపు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. ఈ బాధ్యతలను ప్రొఫెసర్​ కోదండరాం లాంటి నేతలకు అప్పగించింది. ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయడంతో పాటు వాళ్లను సన్మానించాలని సర్కార్  నిర్ణయించింది. అలాగే గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లోనూ ఉద్యమకారులను భాగస్వాములను చేయనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వేడుకలు కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 

ఏ ఒక్కరితోనో తెలంగాణ ఏర్పాటు కాలేదని, అందరూ పోరాడితేనే రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని తెలియజేప్పేందుకు ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం వేదికగా చేసుకుంటున్నది. పార్టీలకు అతీతంగా రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, జర్నలిస్టులు, రైతులు, కవులు, కళాకారులు, స్టూడెంట్లు.. ఇలా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నాయి. ఆయా వర్గాల ప్రతినిధులందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 

రాష్ట్రంలో మలి దశ ఉద్యమం 2009 నుంచి ఉవ్వెత్తున ఎగసింది. ఎంతోమంది అమరుల త్యాగాలతో 2014 జూన్​2న తెలంగాణ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలకు అమరవీరుల కుటుంబసభ్యులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. యూపీఏ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ హోదాలో రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీని సీఎం రేవంత్​రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. 

వేడుకల్లో భాగంగా ఆమెను ఘనంగా సన్మానించనున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతలందరికీ ఆహ్వానాలు పంపించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్​ను ప్రొటోకాల్ అడ్వయిజర్ హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్వీందర్ సింగ్ కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతేకాకుండా కేసీఆర్ కు సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వాన లేఖను కూడా పంపించారు. 

ఉద్యమ జ్ఞాపకాలు నెమరువేసుకునేలా..  

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల పేర్లను ఇవ్వాలని నాడు జేఏసీ కన్వీనర్​గా పని చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ ను కోరగా, ఆయన సర్కార్ కు లిస్టు అందజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల నెంబర్ ప్లేట్లకు, ప్రభుత్వ కార్యాలయ ముందు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారు. 

కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ప్రజల ఇష్టాన్ని కాదని టీజీకి బదులు టీఎస్ అని ప్రకటించింది. అయితే ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. టీఎస్ ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఉద్యమ సమయంలో ప్రతి వేడుక మీద పాడుకున్న ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించింది. అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని ఆదివారం పరేడ్​ గ్రౌండ్ లో​జరగనున్న ఆవిర్భావ వేడుకల్లో రిలీజ్​చేయనున్నారు. కాగా, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చించాకే ముందుకెళ్లాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు.   
 
పదేండ్లలో తొలిసారి ఇలా..

గత ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా పదేండ్లలో ఒక్కసారి కూడా ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఉద్యమకారులందరికీ ఆహ్వానం పంపుతున్నది. ఆవిర్భావ వేడుకల్లో ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్​లో పోలీసుల కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి, సోనియా గాంధీ మాట్లాడతారు. సాయంత్రం ట్యాంక్​బండ్​పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్నివాల్, లేజర్ షో లాంటి కార్యక్రమాలతో పాటు ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. 

ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ 

సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతున్నది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా శుక్రవారం పరిశీలించారు. సెక్యూరిటీపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానిస్తామని పేర్కొన్నారు. దాదాపు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, రిహార్సల్స్ లో భాగంగా పోలీసులు నిర్వహించిన కవాతును సీఎస్, డీజీపీ వీక్షించారు.

కేసీఆర్ వెళ్లడం డౌటే..!  

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు పరేడ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌లో నిర్వహించనున్న సభలో పాల్గొనాలని కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆహ్వానం పంపించారు. కానీ ఆ సభకు కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదే రోజు ఉదయం 10 గంటలకు  తెలంగాణ భవన్‌‌‌‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, ప్రభుత్వం నిర్వహిస్తున్న సభకు పోటీగా అదే రోజు అదే సమయానికి బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కేసీఆర్​కు ప్రత్యేక ఆహ్వానం.. 

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్​ను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వ ప్రొటోకాల్​ అడ్వయిజర్ హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ అర్విందర్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ నందినగర్​​లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పంపించిన ప్రత్యేక లేఖను కూడా ఇచ్చారు. అనంతరం హర్కర వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్​ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరినట్టు చెప్పారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ పండుగ అని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు.