
- గత సర్కార్ చేపట్టిన నియామకాలు, ఎక్స్టెన్షన్లు రద్దు
- జాబితాలో సోమేశ్ కుమార్,
- రాజీవ్ శర్మ, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, చెన్నమనేని రమేశ్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ
- వీళ్ల కోసం నెలకు రూ.2 కోట్లు ఖర్చవుతున్నదన్న ఫైనాన్స్ వర్గాలు
- రిటైర్మెంట్ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న అధికారులపైనా త్వరలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నియమితులైన ఏడుగురు సలహాదారులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. వీరిలో కొంతమంది పదవీకాలం ఉండగా, మరికొంత మంది పదవీకాలం పూర్తయినా ఎక్స్ టెన్షన్ పై కొనసాగుతున్నారు. ఇప్పుడా నియామకాలను, ఎక్స్ టెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లిస్టులో సోమేశ్ కుమార్, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్.శోభ ఉన్నారు.
మాజీ సీఎస్ రాజీవ్‌శర్మ ఈ ఏడాది ఆగస్టు నుంచి ఎక్స్ టెన్షన్ మీద ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. మరో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సీఎం చీఫ్ అడ్వయిజర్‌గా ఉన్నారు. మాజీ డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్, లాఅండ్ ఆర్డర్ అడ్వయిజర్‌గా అక్టోబర్‌లో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కూడా గతేడాది డిసెంబర్నుంచి ఎక్స్టెన్షన్ మీద సలహాదారుగా కొనసాగుతున్నారు. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సలహాదారుగా జీఆర్‌రెడ్డి ఉండగా.. ఫారెస్ట్ అడ్వయిజర్‌గా ఆర్.శోభ గతేడాదిలో, వ్యవసాయ శాఖ చీఫ్అడ్వయిజర్గా చెన్నమనేనని రమేశ్ ఈ ఏడాది ఆగస్టులో అపాయింట్ అయ్యారు. వీరందరి అపాయింట్మెంట్లు, ఎక్స్టెన్షన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సలహాదారులకు ప్రతినెలా దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతున్నట్టు ఫైనాన్స్వర్గాలు పేర్కొన్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న కేవీ రమణాచారి తన పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు.
కొందరు రాజీనామా లెటర్లు ఇయ్యలె..
ఒక ప్రభుత్వ హయాంలో నామినేటెడ్, ఇతర పదవుల్లో నియమితులైనోళ్లు.. మరో ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవంగా రాజీనామాలు చేసి వెళ్లిపోవడం సంప్రదాయంగా వస్తోంది. ఒకవేళ ఎవరైనా అధికారులు, నేతలు ఆయా పదవుల్లో కొనసాగితే మాత్రం కొత్త ప్రభుత్వాలు తొలగిస్తుంటాయి. ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లలో కూడా మరికొంత మంది సలహాదారులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం వారిని కూడా తొలగించనున్నట్టు తెలిసింది.
ఇక కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్పదవుల్లో ఉన్న పలువురు బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే వారిలో కొంతమంది రాజీనామా లెటర్లు ప్రభుత్వానికి పంపలేదని తెలిసింది. వారిలో బేవరేజేస్ కార్పొరేషన్ చైర్పర్సన్, గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ తో పాటు మరో నలుగురు ఉన్నట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ఇప్పటికే రాజీనామా చేశారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా చేయగా, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్లపైనా త్వరలో నిర్ణయం..
రిటైర్ మెంట్ అయిన తర్వాత కూడా ఎక్స్‌టెన్షన్‌పై వివిధ శాఖల్లో కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు. వీళ్లపైనా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. పనితీరు ఆధారంగా వాళ్లను కొనసాగించాలా? తొలగించాలా? అనేది డిసైడ్ చేయనున్నట్టు తెలిసింది. 2014 జులై నుంచి ఎస్పీడీసీఎల్ సీఎండీగా జి.రఘుమారెడ్డి, 2016 అక్టోబర్ నుంచి ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఎ.గోపాల్‌రావు వ్యవహరిస్తున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు 2011లో పదవీ విరమణ చేసి, దశాబ్ద కాలంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా రాజమౌళిని ఇటీవల తిరిగి నియమించారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, శిల్పారామం ప్రత్యేకాధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావు, మెట్రోరైలు శాశ్వత ఎండీగా ఐఆర్‌ఏఎస్ అధికారి ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థిక శాఖ ఓఎస్డీగా రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ చాలా ఏండ్లుగా కొనసాగుతున్నారు.
ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా రిటైర్డ్ ఐపీఎస్ రవీందర్, గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అధికారి ముత్యంరెడ్డి కూడా అవే పోస్టుల్లో ఉన్నారు. రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఈ హమీద్ ఖాన్, అంతర్రాష్ట వ్యవహారాల ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు పదవీ విరమణ తర్వాత అదే హోదా, పోస్టుల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ జలమండలి ఈఎన్‌సీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి 2016 జులైలో రిటైరైనా ఇంకా అదే పదవిలో ఉన్నారు. మిషన్ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్) ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి 2017 నవంబర్‌లో రిటైరైనా నాలుగున్నరేండ్లుగా అక్కడే కొనసాగుతున్నారు. ఆర్‌అండ్‌బీ విభాగంలో ఈఎన్‌సీ బి.గణపతిరెడ్డి 2017 ఫిబ్రవరిలో, ఈఎన్‌సీ పి.రవీందర్‌రావు 2016 జులైలో రిటైరై ఇంకా కొనసాగుతున్నారు.