హాస్పిటల్స్ అంచనాల పెంపులో అక్రమాలు నిజమే..! రెండేళ్లలో అంచనా వ్యయం రూ. 6,714 కోట్లకు పెంపు

హాస్పిటల్స్ అంచనాల పెంపులో అక్రమాలు నిజమే..! రెండేళ్లలో అంచనా వ్యయం రూ. 6,714 కోట్లకు పెంపు
  • బీఆర్ఎస్ ​హయాంలో జరిగిన బాగోతాన్ని నిగ్గు తేల్చిన ఎంక్వైరీ కమిటీ
  • అనూహ్యంగా పెరిగిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ, టిమ్స్ ల నిర్మాణ వ్యయం
  • తొలుత రూ. 3,779 కోట్లతో నిర్మాణాలు ప్రారంభం
  • రెండేళ్లలో అంచనా వ్యయం రూ. 6,714 కోట్లకు పెంపు 
  • తాజాగా రూ. 5,001 కోట్లకు తగ్గించిన కాంగ్రెస్​ ప్రభుత్వం
  • ఇటీవల జరిగిన కేబినెట్‌ మీటింగ్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ కు ఆమోదం
  • రూ.1,713 కోట్లను మిగిల్చిన ప్రస్తుత సర్కార్

హైదరాబాద్, వెలుగు: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ లోని సనత్ నగర్, అల్వాల్, ఎల్ బీనగర్ లో నిర్మిస్తున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్స్ నిర్మాణ వ్యయ అంచనాలను గత బీఆర్ఎస్ హయాంలోనే అడ్డగోలుగా పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిటీ తేల్చింది. రూల్స్ కు విరుద్ధంగా ఇష్టారీతిన భారీస్థాయిలో అంచనా వ్యయాన్ని పెంచినట్లు విచారణలో వెల్లడైంది. 

వరంగల్ హాస్పిటల్ కు 2021 జూన్లో, టిమ్స్ హాస్పిటల్స్ కు 2022 ఏప్రిల్ 26న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు చేశారు. తొలుత వరంగ ల్ హాస్పిటల్ నిర్మాణ వ్యయాన్ని రూ. 1,100 కోట్లు, సనత్ నగర్ టిమ్స్ కు రూ. 882 కోట్లు, అల్వాల్ టిమ్స్ కు రూ. 897 కోట్లు, ఎల్ బీనగర్ టిమ్స్ కు రూ. 900 కోట్ల చొప్పున మొత్తం రూ. 3,779 కోట్లుగా అంచనా వ్యయం వేసి పనులను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి జీవోలు కూడా జారీ చేశారు.  

ఏకంగా 78 శాతం అంచనా వ్యయం పెంపుపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
ఆసుపత్రులు నిర్మాణం చేపట్టిన రెండేండ్ల కాలంలోనే గత సర్కార్.. నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచింది. తొలుత అంచనా వ్యయం రూ. 3,779 కోట్లు ఉండగా, ఎలాంటి ఆమోదం లేకుండానే మౌఖిక ఆదేశాలతో రూ. 6,714 కోట్లకు పెంచింది.  ఏకంగా 78 శాతం పెంచడం గమనార్హం. గత ప్రభుత్వం నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అంచనాలను అడ్డగోలుగా పెంచారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గతేడాది జూన్ 29 జరిగిన సమీక్షా సమావేశంలో ఆస్పత్రుల అంచనా వ్యయం పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండా అంచనా వ్యయాన్ని అలా ఎలా పెంచుతారని అధికారులను ప్రశ్నించారు. అసలు కథ ఏంటో తేల్చాలని ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశించారు. 

రూ. 1,713 కోట్ల ప్రజాధనాన్ని కాపాడిన సర్కార్..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు రూ. 1,100 కోట్లుగా ఉన్న అంచనాను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 2,148 కోట్లకు పెంచింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని రూ.1,528 కోట్లకు తగ్గించింది. ఎల్ బీ నగర్ టిమ్స్ హాస్పిటల్ రూ. 900 కోట్లతో ప్రారంభమైన నిర్మాణ వ్యయాన్ని బీఆర్‌ఎస్ సర్కారు రూ. 1,935 కోట్లకు పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం దానిని రూ. 1,150 కోట్లకు కుదించింది. అల్వాల్ టిమ్స్ మొదట రూ. 897 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని గత ప్రభుత్వం రూ. 1,519 కోట్లకు పెంచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దానిని రూ. 1,196 కోట్లకు తగ్గించింది.

సనత్‌నగర్ టిమ్స్ రూ. 882 కోట్లుగా ఉన్న అంచనాను బీఆర్‌ఎస్ హయాంలో రూ. 1,126 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రూ. 1,112 కోట్లకు సవరించింది. దీంతో ప్రభుత్వం రూ. 1713 కోట్లను కాపాడినట్లయింది. దీంతో రూ. 6,714 కోట్ల నుంచి రూ. 5,001 కోట్లకు నిర్మాణ వ్యయాన్ని తగ్గింది. తగ్గిన రూ. 5,001 కోట్లకే ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.