ఎల్​ అండ్ టీ చుట్టూ బిగుస్తున్న మేడిగడ్డ ఉచ్చు

ఎల్​ అండ్ టీ చుట్టూ బిగుస్తున్న మేడిగడ్డ ఉచ్చు
  • ఎల్​ అండ్ టీ చుట్టూ బిగుస్తున్న మేడిగడ్డ ఉచ్చు
  • మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం  
  • మొదటి నుంచీ రిపేర్లు చేసేందుకు ససేమిరా
  • బ్యారేజీ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన 
  • తర్వాత మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం
  • రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీని 
  • బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రిపేర్లు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న ఎల్అండ్​టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగు స్తున్నది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ, ఆ రిపేర్లు చేయకుండానే అప్పనంగా బిల్లులు పొందిన ఎల్అండ్​టీపై​ ప్రభుత్వం ఫోకస్ ​పెట్టింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకుంటే.. కంపెనీని బ్లాక్​లిస్టులో పెట్టాలని భావిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎల్అండ్ టీ పొందిన బిల్లులను రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్​ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించింది.

కాగా, మేడిగడ్డపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్​ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు ఇంజనీర్లతో పాటు ఎల్అండ్​టీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.మేడిగడ్డ బ్యారేజీ కుంగిన టైమ్ లో రిపేర్లు తామే చేస్తామని ప్రకటించిన ఎల్అండ్​టీ.. ఆ తర్వాత మాట మార్చింది. డిఫెక్ట్​లయబిలిటీ పీరియడ్​పూర్తయిందని, ప్రభుత్వం కొత్తగా అగ్రిమెంట్​చేసుకుంటేనే రిపేర్లు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఎల్అండ్​టీపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.  

2016లో అగ్రిమెంట్..  

మేడిగడ్డ నిర్మాణానికి 2016లో రూ.1,849.31 కోట్లతో టెండర్లు పిలువగా.. ఎల్అండ్​టీ–పీఈఎస్​జాయింట్ ​వెంచర్​2.7 శాతం ఎక్సెస్​కు కోట్​చేసి టెండర్​దక్కించుకుంది. బ్యారేజీ నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేసేలా 2016 ఆగస్టు 26న ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​తో ఎల్అండ్​టీ అగ్రిమెంట్​ చేసుకుంది. నిర్మాణ ఖర్చును 2018లో రూ.3,065.4 కోట్లకు, 2021లో రూ.4,321.44 కోట్లకు పెంచారు. మొత్తంగా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఐదేండ్లలోనే 133.67 శాతం పెంచారు. అయితే గతేడాది అక్టోబర్​21న బ్యారేజీ కుంగిపోయింది. ఎన్డీఎస్ఏ ఎక్స్​పర్ట్ ​టీమ్ ​దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది.

విజిలెన్స్ ​అండ్​ఎన్ ఫోర్స్​మెంట్​డీజీ రాజీవ్​ రతన్ ​ఆధ్వర్యంలో చేసిన విచారణలో ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ఎల్అండ్​టీ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. విజిలెన్స్​ నివేదిక ఆధారంగా రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును టెర్మినేట్​ చేసిన ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిగతా ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపైనా చర్యలకు సిద్ధమవుతున్నది. 

బ్యారేజీ కుంగిన తర్వాత స్పందన.. 

బ్యారేజీకి రిపేర్లు చేయాలని ఎల్అండ్​టీని ప్రాజెక్టు ఇంజనీర్లు ఏండ్ల తరబడి కోరుతూ వచ్చినా, ఆ సంస్థ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ సంస్థ అడిగినట్టుగా నిర్మాణ వ్యయాన్ని పెంచేసిన అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం కూడా రిపేర్లు చేయాలని ఆదేశించలేదు. బ్యారేజీ దెబ్బతినే వరకు స్పందించని ఎల్​అండ్​టీ.. అది కుంగిపోయిన తర్వాత మాత్రం ప్రాజెక్టు ఇంజనీర్లకు పలుమార్లు లేఖలు రాసింది.  ప్రభుత్వం మళ్లీ అగ్రిమెంట్​ చేసుకుని నిధులు ఇస్తేనే రిపేర్లు చేపడుతామని 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20లోనే తాము తెలిపామని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీ నిర్మించామని, ప్రాజెక్టు ఇంజనీర్లు కోరిన పనులు చేయలేమని తేల్చి చెప్పింది.

‘‘2020 జూన్​29న బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్టుగా ఇంజనీర్లు సర్టిఫికెట్​ఇచ్చారు. ఆ రోజు నుంచి రెండేండ్ల పాటు అంటే 2022 జూన్​28న డిఫెక్ట్ ​లయబిలిటీ పీరియడ్ ​పూర్తయింది. బ్యారేజీ ఆపరేషన్స్ ​అండ్ ​మెయింటనెన్స్ (ఓఅండ్​ఎం)​ పీరియడ్ మాత్రం​2025 జూన్​28 వరకు ఉంది. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.9.70 కోట్లతో ఓఅండ్​ఎం పనులు చేశాం. బ్యారేజీకి సంబంధించిన సివిల్, హైడ్రో మెకానికల్ పనులు 2019 జూన్​21న పూర్తి చేశాం. గైడ్​బండ్స్, ఫ్లడ్​బండ్స్, డైవర్షన్ ​చానళ్లు, కుదురుపల్లి నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు అప్రోచ్ రోడ్డు, లెఫ్ట్​ బ్యాంక్, రైట్​ బ్యాంక్, 3డీ మోడల్ ​స్టడీస్​ (లెఫ్ట్, రైట్ ​బ్యాంకులవి) పనులు కూడా అదే రోజున పూర్తి చేశాం. ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​తో మేం చేసుకున్న అగ్రిమెంట్​లో వీఐపీ గెస్ట్ ​హౌస్, ఏఈఈ, డీఈఈ క్వార్టర్లు, కంట్రోల్​ రూమ్​కు అప్రోచ్​ రోడ్డు, గార్డ్​రూమ్, ఫ్యాబ్రికేషన్ ​అండ్ ​ఎరిక్షన్ ​ఆఫ్ ​గేట్స్ ​వంటి నిర్మాణాలు లేకున్నా.. ఆ పనులు కూడా చేశాం” అని ఎల్అండ్​టీ పేర్కొంది.

ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు.. 

మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ ​21న ప్రారంభించగా.. అదే ఏడాది వచ్చిన భారీ వరదలకు లాంచింగ్​ అఫ్రాన్, డౌన్​ స్ట్రీమ్ ​అఫ్రాన్లపై ఏర్పాటు చేసిన భారీ సీసీ బ్లాకులు నదిలోకి కొట్టుకుపోయాయి. అదే ఏడాది నవంబర్​లో వరద తగ్గిన తర్వాత గేట్లు మూయడంతో ఇది తేటతెల్లమైంది. 2020 మే 18న ప్రాజెక్టు ఇంజనీర్లు బ్యారేజీలో దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియిరింగ్​ కోట్​ తదితర నిర్మాణాలు పునరుద్ధరించాలని ఎల్అండ్​టీకి లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 17న సీసీ బ్లాకులు, వియిరింగ్ ​కోట్ ​తిరిగి నిర్మించాలని, అప్రోచ్​ రోడ్లు, డైవర్షన్​చానల్​పై గ్యాంట్రీ క్రేన్లు వెళ్లేలా మెయింటనెన్స్​ బే పనులు పూర్తి చేయాలని ఎల్​అండ్​టీకి ఇంజనీర్లు లేఖ రాశారు. 2022  ఏప్రిల్ ​6న సీసీ బ్లాకులు, వియిరింగ్​ కోట్​ రిపేర్లు చేయాలని, అగ్రిమెంట్​లోని మిగతా పనులు పూర్తి చేయాలని మరోసారి లేఖ రాశారు.

2023 ఏప్రిల్​28న అప్​స్ట్రీమ్, డౌన్​ స్ట్రీమ్​ వియిరింగ్​ కోట్​ రిపేర్లు చేయాలని, కొట్టుకుపోయిన సీసీ బ్లాకులను యథాస్థానంలో ఏర్పాటు చేయాలని మరోసారి ఎల్​అండ్​టీని కోరారు. ఏడో బ్లాకులోని 17, 18, 19, 20 వెంట్స్​ దిగువన ఏర్పడిన బుంగలను గ్రౌంటింగ్​ చేయాలని, లేకపోతే బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. బ్యారేజీ వెంట్స్​తో పాటు దిగువన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వరద సవ్యంగా దిగువకు వెళ్లేలా పనులు చేయాలని కోరారు. కానీ ఈ లేఖలకు ఎల్అండ్​టీ స్పందించలేదు. 

నిర్మాణ వ్యయం 133% ఎట్ల పెరిగింది?

బ్యారేజీ నిర్మాణ వ్యయం 133 శాతం పెరగడంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నిర్మాణ వ్యయం ఏటా 5  శాతం పెరిగిందనుకున్నా, మొత్తంగా 25 నుంచి 30 శాతం మాత్రమే పెరగాలని... కానీ ఏకంగా 133 శాతం పెంచడమేంటని? దాని వెనుక ఏదో జరిగిందని అనుమానిస్తోంది. బ్యారేజీ నిర్మాణంలో అసలు నాణ్యతా ప్రమాణాలు పాటించారా? నిర్దేశిత డిజైన్​ మేరకే బ్యారేజీ నిర్మించారా? లేదా అనే దానిపై ఫోకస్​ పెట్టింది.

ఇప్పటికే శాంపిల్స్​సేకరించిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్, వాటిని సైంటిఫిక్​ స్టడీకి పంపించింది. అలాగే బీఆర్ఎస్ ​ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న రెండు కాంట్రాక్టు సంస్థలు.. మేడిగడ్డలో సబ్ ​కాంట్రాక్టు పనులు చేశాయని, వాటికి ఎల్అండ్​టీ నుంచి బిల్లుల చెల్లింపు ఎలా జరిగిందనే దానిపైనా విజిలెన్స్ ​విచారణ చేపట్టింది. బ్యారేజీ వైఫల్యాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చే నివేదికతో పాటు విజిలెన్స్​ విచారణలో తేలే మిగతా అంశాల ఆధారంగా ఎల్అండ్​టీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. రిపేర్లు చేయకపోతే ఎల్​అండ్​టీని బ్లాక్​లిస్టులో పెట్టి, తెలంగాణలో ఏ టెండర్లలోనూ పాల్గొనకుండా నియంత్రిచనుంది.

అలాగే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి చేసిన పేమెంట్లను రెవెన్యూ రికవరీ యాక్ట్​ప్రయోగించి తిరిగి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకు ఉన్న లీగల్​ఆప్షన్లపై స్టడీ చేస్తున్నది. ఎల్అండ్​టీ చేసిన తప్పులను అన్ని ఆధారాలతో సహా బయటపెట్టి, ఆ సంస్థకు కార్పొరేట్ కాంట్రాక్ట్​ఏజెన్సీలు అండగా నిలువకుండా చూడాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు ఎల్అండ్​టీకి ప్రతిష్టాత్మక సంస్థగా పేరుండేది. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో ఆ సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్​లిస్టులో పేడితే, దేశవ్యాప్తంగా ఎల్అండ్​టీ చేపట్టే మిగతా పనులపైనా తీవ్ర ప్రభావం పడనుంది.