ప్రజా ప్రభుత్వంలోనైనా..పాఠశాల విద్య బాగుపడేనా?

ప్రజా ప్రభుత్వంలోనైనా..పాఠశాల విద్య బాగుపడేనా?

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పాత ప్రభుత్వం పనితీరును రేవంత్​ సర్కార్​ సమీక్షించడం శుభ పరిణామం. కాంగ్రెస్​ ప్రభుత్వం సమీక్షించాల్సిన అతి ముఖ్యమైన అంశాల్లో పాఠశాల విద్య ఒకటి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం అత్యంత నిర్లక్ష్యానికి గురై 50శాతం పాఠశాలలు మూసివేత అంచున ఉన్నాయి. బడి బాట, బడి పిలుస్తోంది రా, జయశంకర్‌ బడి బాట వంటి వాటి ద్వారా పిల్లలను బడులలో చేర్పించే  కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది.  గత ప్రభుత్వం రెసిడెన్షియల్‌ పాఠశాలల సంఖ్యను భారీగా పెంచినా వాటిలో చేరిన విద్యార్థులలో 90శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నవారే కావడం గమనార్హం. 

ఒక ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూల్చి మరొక ప్రభుత్వ వ్యవస్థను నిర్మించడం నిర్మాణాత్మక అభివృద్ధి ఎలా అవుతుంది? ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యారంగంలో మేధావులు  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి రెసిడెన్షియల్స్​గా మార్చాలని డిమాండ్‌ చేస్తే.. దానికి బదులుగా కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఉన్న వ్యవస్థను నాశనం చేశారు. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలలనే రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చి ఆ ఖర్చంతా మౌలిక వసతుల కల్పనకు పెట్టిఉంటే ప్రతి మండలంలోని బడులు బాగుపడేవి. ప్రభుత్వ భూమితో పాటు, బోలెడంత డబ్బు ఆదా అయ్యేది.

సర్కారు బడుల్లో ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశ పెట్టాలి

 ముప్పై ఏండ్ల క్రితమే  ప్రైవేటులో నర్సరీ, ఎల్‌కేజీ. యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ విద్యకు అనుమతిని ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించకుండా గత ఉమ్మడి ప్రభుత్వాలు తప్పుచేశాయి. కేజీ టూ పీజీ అనే అందమైన అబద్ధపు నినాదాన్ని ఇచ్చిన గత కేసీఆర్​ ప్రభుత్వం కూడా కేజీని ప్రారంభించలేదు సరికదా పీజీని సంస్కరించకుండానే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిని ఇచ్చి అదే తప్పు చేసింది. 

ప్రభుత్వ బడులు బద్నాం

ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేలన్ని పిల్లలకు చదవడం, రాయడం రావడం లేదని చెబుతుంటే ఏసీ గదుల్లో కూర్చోన్న మేధావులు మాత్రం ఉపాధ్యాయుడు పాఠాలు ఎలా బోధించాలో శిక్షణల పేరుతో శిక్ష విధిస్తున్నారు.  ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నతి లాంటి కొత్త ప్రయోగాలు వద్దో మొర్రో అని మొత్తుకుని మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వండని అరిచి గీపెట్టినా బలవంతంగా రుద్దుతున్నారు.  ఏకోపాధ్యాయుడు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు ఎఫ్‌ఎల్‌ఎన్‌ను ప్రాథమిక స్థాయిలో 5 తరగతులకు ఎలా అమలుచేయగలరు?.  ఎంఇఓ, డిప్యూటీ ఇఓ లాంటి పర్యవేక్షక పోస్టులు భర్తీ చేయడం లేదు. 

 అక్షరాల నుంచి పదాలు, వాక్యాలు  నేర్చుకోవడానికి బదులుగా వాక్యాల నుంచే అక్షరాలు నేర్చుకోవాలని పుస్తక రచయితలుగా అవతారమెత్తిన ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాలు రాస్తున్నారు. విద్యార్థికి చదువు రావడంలేదని ఉపాధ్యాయుడిని దోషిగా చూపి ప్రభుత్వ పాఠశాలలను బద్నాం చేసి మూసివేత కుట్రకు తెరలేపి ప్రైవేటు విద్యకు దారులు వేయడం గర్హనీయం. సిసిఇని ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ,21 రాష్ట్రాలు దాని దుష్ఫలితాలను సమీక్షించుకొని వెంటనే రద్దు చేసుకొని పాత పద్ధతిని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో మాత్రం  ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వేల కోట్ల రూపాయలతో పాఠశాలల్లో కంప్యూటర్లతో గదులను నెలకొల్పి, ఉన్న బోధకుడిని తీసేసి కంప్యూటర్లను మూలకుపడేసి విద్యార్థులను గ్లోబల్​ సిటిజన్‌గా తయారు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం.  

మౌలిక వసతులు కల్పించాలి

ప్రైవేటు స్కూల్స్​లో కంప్యూటర్లపై పిల్లలు ఆటలాడుతుంటే మన ఘనత వహించిన విద్యాశాఖ పనికిమాలిన శిక్షణలు ఇస్తూ పరువు తీసుకుంటుంది.  98శాతం పాఠశాలలు అటెండర్‌, స్వీపర్‌,  క్లర్క్‌ లేకుండా ఉపాధ్యాయులే ఆ విధులు నిర్వహిస్తూ కాలం వెల్లదీస్తూంటే.. తనిఖీల పేరుతో అధికారులు, నాయకులు మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం బాగాలేదని ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం దౌర్భాగ్యం. రైతులకు, పేదలకు ఉచిత కరెంట్‌ ఇచ్చే పాలకులు ప్రభుత్వ బడులకు ఉచిత కరెంట్‌ ఇవ్వరు. పాఠశాలలకు ఇచ్చే నిధులు విద్యుత్‌ బిల్లుకే సరిపోవు. 

లైబ్రరీలు, ల్యాబ్‌లు అటుంచి 50 శాతం పాఠశాలల్లో నేటికీ టాయిలెట్‌ లాంటి కనీస  వసతులు లేకపోవడం చాలా దురదృష్టకరం.  గత ప్రభుత్వంలా కాకుండా ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం..ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టడంతోపాటు ప్రాథమిక పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్​గా, హైస్కూల్స్‌ రెసిడెన్షియల్స్​గా మార్చాలి. ఈ ప్రయోగాలను ఆపి, అన్ని రాష్ర్టాల్లాగే  సిసిఇని రద్దుచేసి సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి. 

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటివ్వాలి

ఒక పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకొని మౌలిక వసతులతోపాటు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి. కంప్యూటర్‌ విద్య ప్రాధాన్యతను పెంచడంతోపాటు లైబ్రరీలు, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు నెలకొల్పాలి. తరగతి గదికో ఉపాధ్యాయుడిని నియమించాలి. ఇంచార్జ్​ల వ్యవస్థను రద్దు చేసి అన్ని స్థాయిల్లో పర్యవేక్షక పోస్టులను భర్తీ చేయాలి. డిప్యూటేషన్లను రద్దు చేసి, విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్న రిటైర్డ్‌ మేధావులను తొలగించాలి.  గత ప్రభుత్వం విస్మరించిన ఈ అంశాలన్నింటిపై సమీక్షించి పతనం అంచున ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిని ప్రజా ప్రభుత్వం కాపాడాలి.  సీఎం రేవంత్​రెడ్డి ప్రభుత్వం పాఠశాల విద్యాభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ ఆశిస్తున్నది.

ఉపాధి కేంద్రంగా విద్యావ్యవస్థ

 ముప్పై ఏండ్ల క్రితమే అడ్మిషన్‌ వయస్సును ప్రైవేటులో 3 సంవత్సరాలకు తగ్గించిన విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో నేటికి 5 సంవత్సరాలు కొనసాగిస్తున్నది. నర్సరీలో ప్రైవేటుకు వెళ్లిన విద్యార్థి ఒకటవ తరగతికి ప్రభుత్వ పాఠశాలకు ఎలా వస్తాడు?.  ఐఐటీ,  మెడికల్‌ లాంటి ఎంట్రెన్స్‌ పరీక్షలను ఎదుర్శొనేవిధంగా ఇ-– టెక్నో, ఒలింపియాడ్‌ స్కూల్స్‌, కళాశాలలు, ప్రభుత్వ రంగంలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నా నేటికీ ప్రారంభం కాలేదు. ఒకవేళ ఇవన్నీ జరిగి ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఈ దుర్భర స్థితికి వచ్చి ఉండేవి కావు. కొత్త ఉద్యోగాలు సృష్టించబడి నిరుద్యోగులకు అతిపెద్ద ఉపాధి కేంద్రంగా విద్యావ్యవస్థ ఉండేది. పాఠ్యపుస్తకాలలో, బోధనలో ఎటువంటి ప్రయోగాలు లేకుండానే ప్రైవేటు పాఠశాలలు అద్భుతంగా మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే,  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా ప్రయోగాల కాలం నడుస్తున్నది. ఎపెప్‌, డిపెప్‌, క్యూఐపి, ఎల్‌ఇపి, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ), నిష్ట లాంటి ప్రయోగాలంటూ  సంవత్సరానికో ప్రయోగం.  అయితే ఏ ప్రయోగం ఏం ఫలితం సాధించిందో ఇప్పటికీ వెల్లడించలేదు. వీటి వల్ల ప్రజల్లో పాఠశాల విద్యావ్యవస్థ పట్ల ఉండే విశ్వాసం దెబ్బతినడమే కాదు విద్యార్థుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. 

 

డాక్టర్ ఏరుకొండ నరసింహుడు,ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌