మున్సిపాలిటీలపై కాంగ్రెస్ అవిశ్వాసం!

మున్సిపాలిటీలపై కాంగ్రెస్ అవిశ్వాసం!
  •     బీఆర్ఎస్​ చైర్మన్లను గద్దె దింపేందుకు​స్కెచ్​
  •     నల్గొండ, నేరేడుచర్లలో వేగంగా మారుతున్న పాలిటిక్స్​
  •     అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్లకు తీర్మానం  కాపీలు అందజేత 
  •     పాలకవర్గాలకు వచ్చే జనవరి నాటికి నాలుగేళ్లు పూర్తి

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు వారాల్లోనే బీఆర్ఎస్ చైర్మన్లను గద్దె దింపేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాల్లోని నల్గొండ, నేరేడుచర్లలో చైర్మన్లపై అవిశ్వారం పెట్టేందుకు కాంగ్రెస్​ కౌన్సిలర్లు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఈ మేరకు నల్గొండ, సూర్యాపేట కలెక్టర్లకు అవిశ్వాసం తీర్మానం కాపీ అందజేశారు.

గత మున్సిపల్​ఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్‌కు బలం ఉన్నా.. ఎక్స్​ ఆఫిషియో సభ్యులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్​ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పవర్‌‌లోకి రావడంతో తిరిగి మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు స్కెచ్ వేస్తోంది.  పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది జ నవరికి నాలుగేళ్లు పూర్తికానుండగా.. మరో ఏడాది సమయం ఉంది.  

నల్గొండలో అవిశ్వాసం వేగవంతం

నల్గొండ మున్సిపల్​ చైర్మన్​ మందడి సైదిరెడ్డిని గద్దె దించేందుకు శనివారం కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్​ ఆర్‌‌వీ కర్ణన్‌ను​ కలిసి తీర్మానం అందజేశారు. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా.. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన వారితో కలిపి కాంగ్రెస్ బలం 28కి చేరింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉండాలి. అయితే ఎక్స్​ ఆఫిషియో సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ అల్గుబెల్లి న ర్సిరెడ్డితో కలిపి 30 మంది చేరింది. ఇంకో నలుగురు కావాల్సి ఉంటుంది.  

బీఆర్​ఎస్​ నుంచి మరో 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరనున్నారు. చైర్మన్‌ను పదవి నుంచి తప్పించాలంటే 34 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​ పక్షాన ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు అందరు సంతకాలు చేసిన తీర్మానం కాపీని కలెక్టర్​కు అందజేశారు. రూల్స్​ ప్రకారం సంతకాలు పెట్టిన కౌన్సిలర్ల వాయిస్​ను రికార్డు చేశారు. అదేవిధంగా కౌన్సిలర్ల సంతకాలను క్రాస్​ చెక్​ చేస్తు న్నారు.

ఈ ప్రక్రియ ముగియగానే పాలకవర్గానికి కలెక్టర్ నోటీసులు ఇస్తారు.  ఆ తర్వాత ఎన్నికల కమిషన్​అనుమతి మేరకు ఓటింగ్​ నిర్వహిస్తారు. గతంలో బీఆర్ఎస్​ పవర్​లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్​, గుత్తా సుఖేందర్​ రెడ్డి, పల్లా రాజేశ్వరెడ్డిల సపోర్ట్​తో మున్సిపాలిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు సీన్​ రివర్స్​ అయింది. 

నేరేడుచర్లలో కాంగ్రెస్​ దూకుడు

నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్​ మెజార్టీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్​ పవర్‌‌లో ఉండటంతో మాజీ మంత్రి జి.జగదీశ్​ రెడ్డి మున్సిపల్​ కమిషన ర్​మహేందర్​ రెడ్డిని సస్పెండ్​ చేసి మరీ ఓటింగ్‌లో నెగ్గారు. 15 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్​ ఏడు, బీఆర్​ఎస్​ ఏడు, సీపీఎం ఒకటి గెలిచింది. మెజార్టీ ప్రకారం కాంగ్రెస్​ చైర్మన్​ పదవి దక్కాలి. కానీ ఎట్టిపరిస్థితుల్లో మున్సిపాలి టీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఎక్స్​ఆఫిషియో సభ్యులను రంగంలోకి దింపారు. ఎమ్మెల్సీలు శేరిసుభాష్​ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యా దవ్​, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సపోర్ట్​తో చైర్మన్​ సీటు సొంతం చేసుకోవాలని భావించారు.

కానీ మాజీ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అనూహ్యంగా ఎంపీ కేవీపీ రామచంద్రారావును రంగంలోకి దింపడంతో బీఆర్​ఎస్​ కంగుతి న్నది. దీన్ని నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి పాలకవర్గం ఎన్నికలు జరగకుండా వాయిదా వేయించి, అప్పటి కమిషనర్​ను సస్పెండ్​ చేయించారు. కానీ, ఇప్పుడు 15 మంది కౌన్సిలర్లలో ఏడుగురు కాంగ్రెస్​, ఒకరు సీపీఎంతోపాటు ఎక్స్​ఆఫిషియో సభ్యుల బలం ఉంది.

పైగా బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. దీంతో చైర్మన్​ జయబాబును పదవి నుంచి దింపాలని శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్​ వెంకట్రావ్​ను కలిసి తీర్మానం కాపీ అందజేశారు. 

మరో నాలుగు చోట్ల సేమ్ ​సీన్​..

మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ, నందికొండ మున్సిపాలిటీల్లోనూ  అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. కోదాడ మున్సిపాలిటీని వివాదాలు చుట్టముట్టడంతో అక్కడి పాలన అధ్వాన్నంగా మారింది. ఇక మిర్యాలగూడలో తిరునగరు భార్గవ్​ను గద్దె దించేందుకు కాంగ్రెస్​ కౌన్సిలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ 2019 ఎంపీ ఎన్నికల్లో భార్గవ్​ అనుచరులు కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించారనే సమాచారం ఉంది.

ఈ నేపథ్యంలో భార్గవ్​ను గద్దె దించడం అంత తేలికైనా పని కాదని అంటున్నారు. నాగార్జునసాగర్​ నియోజకవర్గ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో  ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం ఓవైపు, మాజీ ఎమ్మెల్యే భగత్​ వర్గం మరోవైపు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో ఇరు వర్గాల్లోని పలువురు కౌన్సిలర్లు బయటకు వచ్చి కాంగ్రెస్​కు సపోర్ట్​ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.