కాంగ్రెస్​కు బిగ్ టాస్క్ .. ఆదిలాబాద్ అభ్యర్థి గెలుపు కోసం తీవ్ర కసరత్తు 

కాంగ్రెస్​కు బిగ్ టాస్క్ .. ఆదిలాబాద్ అభ్యర్థి గెలుపు కోసం తీవ్ర కసరత్తు 
  • 1989 తర్వాత చేతికి దక్కని పార్లమెంట్ పదవి
  • ఈసారి హస్తం వైపు అనుకూల పవనాలు
  • 20 ఏండ్లుగా ఏ పార్టీకీ వరుసగా అందలమివ్వని ఓటర్లు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడాన్ని కాంగ్రెస్ ఛాలెంజ్​గా తీసుకుంది. 1989 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు దక్కడం లేదు. 2008 ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఏడాది పాటు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పదవిలో  కొనసాగారు. ఆతర్వాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. 2009లో టీడీపీ, 2014లో బీఆర్ఎస్, 2018లో బీజేపీ పార్టీలు గెలిచాయి. కొంతకాలంగా మారిన పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్​లో నాటి జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి ఎలాగైనా ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. హస్తం గెలుపు కోసం ఆపార్టీ శ్రేణులు తీవ్రంగా కష్టపడుతున్నారు.

15 ఏండ్లుగా కాంగ్రెస్​కు నిరాశే..

ఆదిలాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో 1952లో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ 8, తెలుగు దేశం ఆరు సార్లు గెలిచాయి. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.నర్సారెడ్డి గెలుపొందారు. కానీ ఆయన కేవలం ఏడాది పాటు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1991లో ఉప ఎన్నికలు జరగ్గా తెలుగు దేశం గెలుపొందింది. అప్పటి నుంచి వరుసగా 18 ఏండ్లపాటు ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ గెలవలేకపోయింది. చివరిసారిగా 2008లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన కూడా ఏడాది మాత్రమే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 15 ఏండ్ల నుంచి కాంగ్రెస్​కు పార్లమెంట్ ఎన్నికల్లో నిరాశే మిగిలింది. ఇలా చూసుకుంటే దాదాపు 33 ఏండ్లుగా ఆదిలాబాద్ పార్లమెంట్​లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

సెంటిమెంట్ కలిసొచ్చేనా..

గత కొన్నేండ్లుగా ఏ పార్టీకి వరుసగా పార్లమెంట్ సీటు కట్టబెట్టని ఆదిలాబాద్ ఓటర్లు సెంటిమెంట్​గా ఈసారి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తున్న అధిష్ఠానం ఎంపీ సీటు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఈ సారి కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను వేర్వేరుగా ఓటర్లు పరిగణించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడి సాంప్రదాయ తీర్పును బట్టి ఈ సారి కాంగ్రెస్​కు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధిష్ఠానంతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివాసీల్లో మంచి పేరున్న సుగుణకు పార్టీ టికెట్​ఇచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవడంతో పార్టీలో జోష్​ కనిపిస్తోంది.

ఓటర్ల భిన్నమైన తీర్పు

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గత 20 ఏండ్లుగా ఓటర్లు భిన్నమైన తీర్పు ఇస్తున్నారు. 1952లో మొదటిసారి సోషలిస్ట్​ పార్టీ గెలుపొందగా ఆ తర్వాత వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. అలాగే 1991 నుంచి 2004 వరకు వరుసగా టీడీపీ గెలుపొందింది. ఆ తర్వాత ఓటర్లు ఏ పార్టీకీ వరుస విజయాలు కట్టబెట్టలేదు. 2004లో బీఆర్ఎస్​లో గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ ఇలా 20 ఏండ్ల నుంచి ఒక్కో పార్టీకి ఆదిలాబాద్ ఓటర్లు అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తారా అనే చర్చ సాగుతోంది.

2009 లోక్​సభ నియోజకవర్గాల విభజన తర్వాత ఆదిలాబాద్​ను ఎస్టీ రిజర్వడ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఖానాపూర్​లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలోని సీన్ పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ సీట్లు గెలవకపోయినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీలోకి వలసలు పెరగడం, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమైంది.