కర్నాటక సీఎం కుర్చీ ఎవరికి.. ? రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్

కర్నాటక సీఎం కుర్చీ ఎవరికి.. ? రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్

సీఎం కుర్చీ ఎవరికి?
రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్
సీనియార్టీలో సిద్ధు.. ట్రబుల్ షూటర్​గా డీకే
హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్న లీడర్లు
సీఎం రేసులో మరో నేత జి.పరమేశ్వర పేరు
లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటున్న అధిష్టానం
నేడు సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థిపై ప్రకటన
రేపు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!


బెంగళూరు :
‘కాంగ్రెస్ గెలిచింది సరే.. ఇంతకీ సీఎం ఎవరు?’.. ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఈ ప్రశ్న ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ రేసులో ముందున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నది. సీనియారిటీ పరంగా చూస్తే సిద్ధు వైపు.. విధేయతను పరిగణనలోకి తీసుకుంటే డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మధ్యేమార్గంగా మరో విషయాన్ని కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నది. ఇద్దరినీ సంతోషపరిచేందుకు చెరో రెండున్నరేండ్లు సీఎంగా ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నది. ఆదివారం జరిగే సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపికపై స్పష్టత వచ్చే చాన్స్ ఉందని నేతలు అంటున్నారు. 

మూడో వ్యక్తి పేరు కూడా..

సీఎం రేసులో సిద్ధ రామయ్య, డీకే శివకుమార్​తో పాటు మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర. ఈయన పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర.. రాష్ట్రంలోని బలమైన నేతగా ఉన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్​ పరిశీలిస్తున్నది. స్టేట్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్​గా కూడా వ్యవహరిస్తున్నారు. కర్నాటక ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? తమవైపు తిప్పుకునేందుకు ఎలాంటి మేనిఫెస్టో రూపొందించాలన్న అంశంపై తీవ్ర కసరత్తు చేశారు. మహిళలకు రూ.2000 పింఛన్ వంటి కీలక హామీలు తెరపైకి తీసుకొచ్చారు. జమ, ఖర్చు వంటి లెక్కలపై మంచి పట్టుంది. ఒక ఇంటర్వ్యూలో ‘‘నేను ఎందుకు సీఎం కాకూడదు?”అనే కామెంట్ కూడా చేశారు. రాజకీయాల్లోకి వచ్చినోళ్లు ఎవరైనా సీఎం కావాలనే కోరుకుంటారనే వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవం ఉంది. డీకే, సిద్ధరామయ్య కాకపోతే పరమేశ్వరను సీఎంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. 

చెరో రెండున్నరేండ్లు సీఎం పదవి

ఓ వైపు సీఎంగా ప్రజలు కోరుకుంటున్న సిద్ధ రామయ్య, మరోవైపు పార్టీని అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడి పని చేసిన డీకే శివకుమార్. ఇద్దరికీ సీఎం కావాలనే కోరిక బలంగా ఉంది. కానీ, హైకమాండ్​ మాత్రం ఒక్కరికే అవకాశం ఇస్తుంది. అదే జరిగితే రెండో వ్యక్తి బాధపడే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ హైకమాండ్​ ఒకరిని సీఎం చేసి మరొకరిని బుజ్జగించొచ్చు. ఇద్దరినీ సంతోషపర్చాలంటే చెరో రెండున్నరేండ్లు సీఎంగా అవకాశాన్ని కూడా హైకమాండ్​ పరిశీలిస్తున్నది. సీఎంలు మారినప్పుడు మంత్రివర్గం కూడా మారే అవకాశాలు ఉంటాయి. అధికారాన్ని పంచుకునే ఆలోచన లేదని ఇద్దరు లీడర్లు గతంలో చాలా సార్లు ప్రకటించారు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో హైకమాండ్ ఈ నిర్ణయం కూడా తీసుకునే చాన్స్ ఉంది.

నేడు సీఎం అభ్యర్థిపై క్లారిటీ.. రేపే ప్రమాణస్వీకారం

కర్నాటకలో కొత్త సర్కార్‌ కొలువు దీరడానికి ముహూర్తం ఖరారైనట్టు కనిపిస్తున్నది. శనివారం సాయంత్రం సీఎం బస్వరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. 
గవర్నర్‌ను కలిసి లేఖను అందజేశారు. ఆదివారం సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్​ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్​కు ఏర్పాట్లు చేసే యోచనలో కాంగ్రెస్​ పార్టీ ఉంది. అయితే, అదేరోజు కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ పుట్టినరోజు కూడా. తన పుట్టినరోజు నాడు సోనియా గాంధీ తనకు గిఫ్ట్‌ ఇస్తానని మాటిచ్చారని డీకే గతంలో ఒక స్టేట్​మెంట్ ఇచ్చారు. దీంతో.. సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. అయితే, డీకే శివకుమార్​ ఏ హోదాలో ప్రమాణ స్వీకారం చేస్తారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్​ హైకమాండ్ ఆయనకు ఏం గిఫ్ట్‌ ఇస్తుందనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆదివారం సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రంకల్లా ఓ స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.

డీకే శివకుమార్ ప్లస్​ పాయింట్లు

  •     డీకే శివకుమార్ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు.
  •     లోక్ సభ ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత గుండు రావు స్థానంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి ఎంతో కష్టపడి పనిచేశారు.
  •     ట్రబుల్​ షూటర్​గా పేరు ఉంది. ఫైనాన్షియల్​గా బలంగా ఉన్న నేత. పార్టీకి నిధులు ఇవ్వడంలో ముందుంటారు.
  •     కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే పేరుంది.
  •     జనాభా పరంగా రెండో అతిపెద్ద సామాజిక వర్గమైన వొక్కలిగకు చెందిన ఆయన.. ఆ సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి పడటంలో కీలక పాత్ర పోషించారు.
  •     సోనియా గాంధీ ఒకప్పటి రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ ఎన్నికలో శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 

మైనస్​ పాయింట్లు

  •     డీకే శివకుమార్​పై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఉన్నాయి.  మనీ లాండరింగ్, పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆయన 104 రోజులపాటు తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు.
  •     ఒకవేళ డీకేను సీఎం చేస్తే.. ఆయనపై నమోదు చేసిన కేసుల విచారణను వేగవంతం చేసే అవకాశం ఉంది. 
  •     కేంద్ర ప్రభుత్వం కేసుల ఎంక్వైరీని స్పీడప్​ చేస్తే ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఉంది. సీఎం పదవి కోసం మళ్లీ గొడవలు స్టార్ట్  కావచ్చు.

సిద్ధరామయ్య ప్లస్​ పాయింట్లు

  •     సిద్ధరామయ్య 2013 నుంచి 2018 దాకా సీఎంగా ఉన్నారు. ఐదేండ్ల పూర్తి కాలం సీఎంగా ఉన్న ముగ్గురు నేతల్లో సిద్దరామయ్య ఒకరు.
  •     ఎన్నికల ముందు జరిగిన సర్వేలో సీఎంగా సిద్దూయే కావాలని ప్రజలు కోరుకున్నారు. 
  •     కర్నాటకలోని ఇద్దరు పెద్ద లీడర్లలో ఒకరు యడియూరప్ప కాగా, మరొకరు సిద్ధరామయ్య. ప్రస్తుతం యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
  •     76 ఏండ్ల సిద్ధరామయ్య ఇవే తన చివరి ఎన్నికలని ఇది వరకే ప్రకటించారు. సీఎంగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. 
  •     అహింద (ముస్లింలు, బీసీలు, దళితులు) వర్గానికి సిద్ధరామయ్య మాస్ లీడర్‌గా ఎదిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
  • మైనస్​ పాయింట్లు
  •     తన సొంత సామాజికవర్గానికి (కురుబ) చెందిన అధికారులకు ఆయన అనుచిత ప్రాధాన్యం ఇస్తారనే అపవాదు ఉంది.
  •     టిప్పు సుల్తాన్‌పై ఆయన ప్రశంసలు గుప్పించడం కూడా చాలా మందికి నచ్చలేదు.
  •     ఒక్కళిగ, లింగాయత్‌ సామాజిక వర్గాలను పార్టీకి దూరం చేశారనే విమర్శలు ఉన్నాయి. 
  •     క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలను విడుదల చేయడం విమర్శలకు దారితీసింది.