సీనియర్లకు కళ్లెం!

సీనియర్లకు కళ్లెం!
  • పక్క నియోజకవర్గాల్లో జోక్యంపై  అసహనం
  • చేరికలను అడ్డుకోవడంపై హైకమాండ్‌కు రిపోర్ట్
  • కొత్త నేతల చేరికకు లైన్ క్లియర్  

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌‌లోని సీనియర్లకు హైకమాండ్ కళ్లెం వేస్తున్నది. వాళ్లు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటుండడంతో అక్కడి నేతల మధ్య విభేదాలు వస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు చేపడుతోంది.  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర పార్టీల నేతలు తమకు అవసరం లేదని ప్రకటించినా.. హైకమాండ్ చేరికలపై ఫోకస్‌‌ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ మారడంతో అలర్ట్‌‌ కాకపోతే నష్టపోతామని సునీల్​కనుగోలు టీమ్​సర్వే రిపోర్ట్​ఇవ్వడంతోనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

30 ఏళ్ల నుంచి వాళ్లదే ఆధిపత్యం.. 

కాంగ్రెస్‌‌ సీనియర్‌‌‌‌ నేతలైన పీసీసీ మాజీ చీఫ్​ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక టరెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్​రెడ్డి ముప్పై ఏళ్లుగా ఉమ్మడి జిల్లాను శాసిస్తున్నారు.  సొంత నియోజకవర్గాలతో పాటు పక్క సెగ్మెంట్లపైనా పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో వర్గపోరు కామన్‌‌గా మారడంతో నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.  అంతేకాదు కొత్త లీడర్లు ఎంట్రీ ఇవ్వాలన్నా, ఇతర పార్టీల నేతలు చేరాలన్నా వీళ్ల పర్మిషన్ తీసుకోవాల్సి రావడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్​ నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీలో చేరిన లీడర్లు తిరిగి సొంత గూటికి రావాలన్నా ఇదే పరిస్థితి ఉండడంతో వాళ్లు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

సునీల్ సర్వే రిపోర్ట్‌‌ ఆధారంగా..

ఉమ్మడి జిల్లాలో సీనియర్ల  వైఖరిపై సునీల్ కనుగోలు టీమ్ హైకమాండ్‌‌కు రిపోర్ట్ ఇవ్వగా.. ఇటీవల  గాంధీ భవన్​లో పొలిటికల్​అఫైర్స్​ కమిటీలో చర్చినట్లు తెలిసింది. దీంతో పక్క నియోజకవర్గాల్లో సీనియర్ల జోక్యం, గ్రూప్‌‌ రాజకీయాలు కట్టడి చేసే ప్రయత్నాలు మొదలైనట్లు చర్చ జరుగుతోంది. ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సైలెంట్‌‌గా ఉండడం, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం హైదరాబాద్‌‌ కేంద్రంగా రాజకీయాలు చేస్తుండడమే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది.  ఈ కారణంతోనే ఉత్తమ్‌‌తో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరుతున్నట్టు ప్రచారం జరిగినా.. ఇద్దరు ఖండించారు. 

చేరికలపై ఫోకస్ 

కొత్త వాళ్లు అవసరం లేదని ఎంపీ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేకుండా హైకమాండ్​ కొత్త చేరికలపై ఫోకస్​ పెట్టింది. ఉత్తమ్​ ప్రధాన అనుచరుడు యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్ రెడ్డి ప్లేస్‌‌ను భర్తీ చేసేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత చింతల వెంకటేశ్వరెడ్డి, బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.  నకిరేకల్​మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడా పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  బీఆర్​ఎస్​ సీనియర్​ నేత, మాజీ ఎమ్మె ల్సీ నేతి విద్యాసాగర్​ కూడా తిరిగి కాంగ్రెస్‌‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.