ముగ్గురు సీనియర్లు ఇద్దరు కొత్తోళ్లు.. కోదాడ నుంచి మూడోసారి ఉత్తమ్​భార్య పద్మావతికి టికెట్

ముగ్గురు సీనియర్లు ఇద్దరు కొత్తోళ్లు.. కోదాడ నుంచి మూడోసారి ఉత్తమ్​భార్య పద్మావతికి టికెట్
  • సాగర్‌‌‌‌ నుంచి జయవీర్​, నకిరేకల్‌‌లో మాజీ ఎమ్మెల్యే వీరేశం.. 
  • బీసీ కోటాలో అయిలయ్యకు దక్కిన అవకాశం

నల్గొండ, వెలుగు :  ఉమ్మడి జిల్లాలోని ఆరు స్థానాలకు కాంగ్రెస్​ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదివారం ఏఐసీసీ ప్రకటించిన తొలి జాబితాలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ, నల్గొండ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి హుజూర్​నగర్​, ఆయన భార్య పద్మావతి కోదాడలో ఛాన్స్‌‌ దక్కింది.  సీ నియర్​ నేత జానారెడ్డి రెండో కొడుకు కుందూరు జయవీర్​ రెడ్డికి నాగార్జు నసాగర్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు  నకిరేకల్, బీసీ కోటాలో బీర్ల అయిలయ్యకు ఆలేరు టికెట్లు కన్ఫామ్ అయ్యాయి. తుంగతుర్తి, సూర్యాపేట, భువనగిరి, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాలను హైకమాండ్ పెండింగ్​లో పెట్టింది.  సీపీఎం, సీపీఐ పొత్తుల వ్యవ హారం కొలిక్కిరాకపోవడంతో మిర్యాలగూడ, మునుగోడు స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించలేదు. 

నాలుగు స్థానాల్లో తీవ్ర పోటీ

భువనగిరి, దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తిలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  సూర్యాపేట నుంచి మాజీ మంత్రి దామోదర్​ రెడ్డి పేరు ఉంటుందని భావించినా..  పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి వర్గీయులు పటేల్​రమేశ్‌‌​రెడ్డి టికెట్​ కోసంపట్టుపడుతుండడంతో పెండింగ్​లో పెట్టారు.  దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌‌కు వ్యతిరేకంగా కిషన్​ నాయక్​, రవి నాయక్​ టికెట్‌‌ అడుగుతున్నారు. భువనగిరిలో  కుంభం పేరు దాదాపు ఫైనల్ అయ్యిందని పార్టీ నేతలు చెబుతున్నా..  తనకే టికెట్ ఇవ్వాలని, లేదంటే బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తుంగతుర్తిలో అద్దంకి దయాకర్​, కొండేటి మల్లయ్య, ప్రీతం, పిడమర్తి రవి, డాక్టర్​ రవి టికెట్ ఆశిస్తున్నారు.  కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎం కోరుతోంది. ఇక్కడ కాంగ్రెస్​ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి టికెట్​ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్​ రెడ్డి కూడా మిర్యాలగూడ టికెట్​ అడుగు తున్నారు. మునుగోడు స్థానాన్ని చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తుండగా.. పొత్తులో భాగంగా సీపీఐ తమకు కావాలని కోరుతోంది. 

బరిలోకి భార్యాభర్తలు... ఐదోసారి కోమటి రెడ్డి

2014 ఎన్నికల నుంచి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఆయన భార్య పద్మావతి పోటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 2014 ఎన్నికల్లో కోదాడ ఎమ్మె ల్యేగా పద్మావతి తొలిసారిగా గెలిచారు. ఆ తర్వాత 2018లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. హుజూర్​నగర్​ ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో పద్మావతి ఓడిపోయారు. ఈసారి ఇద్దరు టికెట్ తెచ్చుకున్నారు.  

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నారు. 1999 నుంచి 2014 వరకు వరస జరిగిన ఎన్నికల్లో ఎమ్మె ల్యేగా గెలుపొందిన ఆయన ఫస్ట్​ టైం 2018లో ఓడిపోయారు. మరుసటి ఏడాది జరిగిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలుపొందారు.  ఈ సారి లాస్ట్ టైం ఓడిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితోనే తలపడనున్నారు.  నాగార్జునసాగర్​ వారసుల మధ్య పోరు జరగబోతుంది.

మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు ఎమ్మెల్యే భగత్​, జానారెడ్డి రెండో కొడుకు జయవీర్​ రెడ్డి ఎన్నికల్లో తలపడనున్నారు. జానారెడ్డి 2018 ఎన్నికల్లో నర్సింహయ్య మీద ఓడిపోగా, ఆయన చనిపోయాక జరిగిన బైపోల్​లో భగత్​ చేతిలో జానారెడ్డి మరోసారి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించిన జానారెడ్డి ఈ ఎన్నికల్లో కొడుకు గెలుపు కోసం తీవ్రంగానే కష్టపడుతున్నారు.