- నేనే పోటీ చేస్తా...లేదు నేనే పోటీ చేస్తా..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఓ వర్గం పార్టీ జిల్లా ఆఫీసును ఏర్పాటు చేయడంతో మరోమారు వర్గ రాజకీయాలు రచ్చకెక్కాయి.
ఎవరికి వారే..
జిల్లా కాంగ్రెస్ పార్టీలో అందరిదీ ఒకే మాట. టికెట్ నాదే, నేనే పోటీ చేస్తా అంటూ ఆశావహులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ఆఫీస్‌లను తామే ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఇప్పటికే మూడు కాంగ్రెస్ ఆఫీస్లుండగా ఇప్పుడు కొత్తగా చుంచుపల్లి మండలంలో పార్టీ జిల్లా ఆఫీస్‌ను ఏర్పాటు చేయడం, దాన్ని డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య ప్రారంభించడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది. జిల్లా అధ్యక్షులే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆఫీస్‌ల కుంపట్లు..
కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీస్ కొనసాగుతోంది. ఈ ఆఫీస్‌ను సీఎల్పీ నేత భట్టి అనుచరులు నిర్వహిస్తున్నారు. ఇదే జిల్లా ఆఫీస్అంటూ పేర్కొంటుంటారు. కాగా బస్టాండ్ సెంటర్లోనే జిల్లా పార్టీ ఆఫీస్‌కు కూత వేటు దూరంలో రేణుక చౌదరి క్యాంప్ ఆఫీస్ పేర పార్టీ కార్యక్రమాలను టీపీసీసీ కార్యదర్శి ఎడవల్లి కృష్ణ నిర్వహిస్తున్నారు. చుంచుపల్లి మండలంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్ పేర పార్టీ ఆఫీస్‌ను గతేడాది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే మండలంలో పార్టీ సీనియర్ నేత నాగ సీతారాములు జిల్లా పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.
కార్యకర్తల్లో అయోమయం..
నిన్నటి వరకు బస్టాండ్ సెంటర్లోని ఆఫీస్‌కు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య నాగ సీతారాములు ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్‌ను బుధవారం ప్రారంభించారు. దీంతో వర్గపోరుకు మరింత ఆజ్యం పోసినట్లైంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఎవరికి వారే జిల్లా ఆఫీస్ లు ఏర్పాటు చేసుకుంటుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
మహిళ కాంగ్రెస్ కోసం మరో ఆఫీస్?
నిన్న మొన్నటి దాకా బస్టాండ్ సెంటర్లోని జిల్లా ఆఫీస్‌లోనే మహిళా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. కాగా ఆఫీస్‌కు మీరు రావద్దంటూ మహిళా కాంగ్రెస్ నాయకులకు పార్టీ ఆఫీస్ సిబ్బంది చెప్పడంతో ఖంగుతిన్నారు. దీంతో తాము ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నారు. టికెట్‌ను ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మోత్కూరి ధర్మారావులను సమన్వయం చేయాల్సిన డీసీసీ ప్రెసిడెంట్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య నాగ సీతారాములు ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్‌ను ప్రారంభించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
గ్రూపు రాజకీయాలు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, రేణుక చౌదరి వర్గాలుగా జిల్లా కాంగ్రెస్ నేతలు చీలిపోయారు. మరో వైపు సీనియర్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్, లక్కినేని సురేందర్ మరో గ్రూపుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పలు మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఇటీవలి కాలంలో సమావేశమై జిల్లా అధ్యక్షుడే పార్టీలో వర్గపోరును ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇల్లెందులోనూ అదే తీరు..
ఇల్లెందు నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తూ ఎవరికి వారే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇల్లెందు పార్టీ ఆఫీస్‌లో ఇటీవలి కాలంలో నాయకులు కొట్టుకున్న సందర్భాలున్నాయి. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ లో నాయకుల వర్గ పోరుతో కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తుంది.