మంత్రి జగదీశ్ రెడ్డిపై ఘాటు విమర్శలు: అద్దంకి దయాకర్

మంత్రి జగదీశ్ రెడ్డిపై ఘాటు విమర్శలు: అద్దంకి దయాకర్

ఇంటర్‌ విద్యార్థులకు తగిన విధంగా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.  గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై మండిపడ్డారు.నాంపల్లి ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులపై పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించడంపై అద్దంకి దయాకర్ అభ్యంతరం తెలిపారు. ప్రశ్నించినoదుకు వెళ్లిన మంద కృష్ణ మాదిగను హౌజ్ అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

దద్దమ్మలు మంత్రులుగా ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు దయాకర్. ఇంతా జరుగుతున్న సిగ్గు లేకుండా పదవిని అనుభవిస్తున్న జగదీష్ రెడ్డికి  బుద్ధి ఉండాలన్నారు. అతన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి పార్టీ పిరాయింపుల మీద ఉన్న ప్రేమ..  ఇంటర్ విద్యార్థుల మీద లేదని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి వచ్చిన అధికార పార్టీ నాయకులు.. ఇంటర్ విద్యార్థులు  చనిపోతుంటే ఎందుకు మాట్లాడడం లేదన్నారు.  చనిపోయిన విద్యార్థులను పరామర్శించడానికి  టీఆర్ఎస్ నాయకులు ఎందుకు  రావడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మీద ఆర్టికల్ 356 ఎందుకు పెట్టడం లేదు. ఈ ఘటనపై కోర్ట్ సుమోటో గా తీసుకుని ప్రభుత్వం మీద కేస్ పెట్టాలని దయాకర్ డిమాండ్ చేశారు.

 ఏ అర్హత ఉందని ఆ సంస్థకు అధికారమిచ్చారు.?

ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వం టెండర్లు  ఎందుకు ఇచ్చిందో సమాధానం చెప్పాలని  కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతా రాయ్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు పూర్తై  3 ఏండ్లు గడిచినప్పటికీ  టీఎస్ పి ఎస్ సి ఒక్కరికి పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. ఇంటర్ బోర్డ్ లో అవకతవకలు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలన్నారు.