
- రాజు అంధుడిగా కూర్చుని ఉన్నారు: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి
- చంద్రుడి నుంచి చీతాల దాకా ప్రతి అంశంపై మోదీ మాట్లాడుతారు..
- కానీ మణిపూర్ విషయంలో మిస్టర్ సైలెంట్ అయిపోయారు
- దేశం నుంచి పోలరైజేషన్, కమ్యునలైజేషన్,
- శాఫ్రనైజేషన్ వెళ్లిపోవాలని కామెంట్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘హస్తినలో రాజు అయిన ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇప్పుడు రాజు అంధుడిగా కూర్చుని ఉన్నారు. నాడు హస్తినలో జరిగిన దానికి, ఇప్పుడు మణిపూర్‌లో జరిగిన దానికి పెద్ద తేడా ఏం లేదు’’ అని ఆరోపించారు. గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు సంయమనంతో మాట్లాడాలని, సభా మర్యాదను పాటించాలని సూచించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు. అధిర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అధిర్ మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీ 100 సార్లు ప్రధాని అయినా నాకేం బాధలేదు. కానీ దేశ ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతున్నది” అని చెప్పారు. క్విట్ ఇండియా అనేది జరగాలని.. కాకపోతే పోలరైజేషన్, కమ్యునలైజేషన్, శాఫ్రనైజేషన్ దేశం నుంచి వెళ్లిపోవాలని (క్విట్ ఇండియా) చెప్పారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు దేశం నుంచి వెళ్లిపోవాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
ప్రధానిని రప్పించేందుకు వేరే దారిలేక..
‘‘మణిపూర్ ప్రజలకు ప్రధాని శాంతి సందేశం ఇవ్వాలని మాత్రమే కాంగ్రెస్ కోరుకుంటున్నది. కనీసం తన మన్‌కీ బాత్‌లో అయినా ఒకసారి ఆయన మాట్లాడాలి. మణిపూర్‌లో హింస అనేది చిన్న విషయం కాదు. అక్కడ జాతుల మధ్య హింస, ఓ సివిల్ వార్ జరుగుతున్నది. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యూరోపియన్ పార్లమెంట్, అమెరికాలోనూ చర్చించారు. మణిపూర్ సమస్య ఏ రాష్ట్రానికీ పరిమితం కాదు. అందుకే ప్రధాని అనివార్యంగా జోక్యం చేసుకోవాలి” అని అధిర్ రంజన్ చౌధురి సూచించారు. ప్రధానిని లోక్‌సభలోకి రప్పించేందుకు వేరే దారిలేకనే అవిశ్వాస తీర్మానాన్ని తమ ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిందని చెప్పారు. చంద్రుడి నుంచి చీతాల దాకా మోదీ ప్రతి అంశంపై మాట్లాడుతారని, కానీ మణిపూర్ విషయంలో మిస్టర్ సైలెంట్ అయిపోయారని విమర్శించారు. మధ్యలో కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ప్రసంగం కొనసాగించిన అధిర్.. తాను మాట్లాడుతుంటే ప్రధానికి సమస్య లేనప్పుడు అమిత్ షా ఎందుకు ఆగ్రహానికి గురవుతున్నారని ప్రశ్నించారు.
సభ నుంచి సస్పెండ్
లోక్‌సభ నుంచి అధిర్ రంజన్ చౌధురిని సస్పెండ్ చేశారు. ప్రధాని, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు, డిబేట్ జరుగుతున్నప్పుడు అధిర్ ఆటంకం కలిగిస్తున్నారని, ఆయన్ను సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. ఆయన దుష్ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశామని, కమిటీ నివేదిక వచ్చే దాకా అధిర్ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ చెప్పారు. ఈ చర్య అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తర్వాత మీడియాతో అధిర్ మాట్లాడుతూ.. ‘‘హస్తినలో రాజు అయిన ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇప్పుడు రాజు అంధుడిగా కూర్చుని ఉన్నారు. అలాంటి ఘటనే మణిపూర్‌లో జరిగింది. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఎవరినీ అవమానించడం కాదు. మణిపూర్‌లో మంటల్లో ఉన్నప్పుడు నీరో ఫ్లూటు ఊదుతున్నాడని నేను అంటే.. ఎవరినో అవమానిస్తున్నట్లు కాదు. ఇది భావ వ్యక్తీకరణ మార్గం” అని చెప్పారు.