పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం గడ్డం వంశీకృష్ణ దరఖాస్తు

పెద్దపల్లి  ఎంపీ టికెట్ కోసం గడ్డం వంశీకృష్ణ దరఖాస్తు

కాంగ్రెస్ లో   ఎంపీ టికెట్ల కోసం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.  లోక్ సభ టికెట్ ఆశిస్తున్న  పార్టీ  నేతలు  గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ గడువు ఇచ్చింది పీసీసీ. ఇవాళ ఆఖరి తేది కావడంతో ఆశావాహులు క్యూ కడుతున్నారు. 

పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు.  ఈ సందర్బంగా మాట్లాడిన వంశీకృష్ణ.. కాకా వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.  అవకాశం ఇస్తే పెద్దపల్లి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానన్నారు. కాకా మనువడిగా పుట్టడం అదృష్టమే కాదు.. ఒక బాధ్యత అన్నారు వంశీకృష్ణ.  స్వాతంత్ర్య, తెలంగాణ రాష్ట్ర  ఉద్యమకారుడు కాకా అని  చెప్పారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై  భారీ మెజారిటీతో  గెలిచారు. ఈ ఎన్నికల్లో  వివేక్ వెంకటస్వామి తనయుడు  గడ్డం వంశీ కృష్ణ  తండ్రికి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఆయన పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో పెద్దపల్లి ఎంపీగా వివేక్ వెంకటస్వామి గెలుపొందారు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి   తనయుడు వంశీకృష్ణ ఎంపీగా బరిలోకి దిగనున్నారు.