పాలకుర్తిలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

పాలకుర్తిలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

తొర్రూరు, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గల్లంతవడం ఖాయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూరు మండలం సోమారం గ్రామంలో ఎంపీటీసీ క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి చిత్తుచిత్తుగా ఓడారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఫలితం బీఆర్ఎస్ కు పునరావృతం అవుతుందన్నారు. యశస్వినిరెడ్డి, తాను అత్తాకోడలులా కాకుండా తల్లీబిడ్డలా ఉంటున్నామని, మా మధ్య విభేదాలు సృష్టించడానికి గులాబీ చీడపురుగులు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తాను అమెరికా వెళ్తానని, ఇక్కడ అందుబాటులో ఉండనని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రచారం చేస్తున్న ఎర్రబెల్లినే అమెరికాకు పంపిస్తానే తప్ప పాలకుర్తిని వదిలి నేను ఎక్కడికి వెళ్లనని చెప్పారు. 

పాలకుర్తి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొందన్నారు. పాత, కొత్త కలయికతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళుతున్నానని, అందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. సోమవారం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కొండ మధుసూదన్ రెడ్డి ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హమ్యా నాయక్, సుంచు సంతోష్, ఎర్రబెల్లి రాఘవరావు, బాపురెడ్డి, నెహ్రూ నాయక్, డాక్టర్  సోమేశ్వరరావు, పెదగాని సోమయ్య, సోమ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.