
- ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం
- హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు
సంగారెడ్డి/జోగిపేట/పుల్కల్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆమెకు తోడుగా నడిచారు. 161వ నేషనల్ హైవే దారి పొడవునా పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ లైటింగ్, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, కమాన్లు, పార్టీ జెండాలు, బెలూన్లు ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. జనహిత పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేశ్ షెట్కార్ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎ ఫయిమ్ పాల్గొన్నారు.
అందోల్ మండలం సంగుపేట నుంచి జోగిపేట పార్టీ ఆఫీసు వరకు పాదయాత్ర కొనసాగింది. అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన ఆమె మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అందోల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోగిపేట హనుమాన్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.