ఈ నెల 21 వరకు కర్నూల్ లో రాహుల్ పాదయాత్ర

ఈ నెల 21 వరకు కర్నూల్ లో రాహుల్ పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటక నుంచి ఏపీలోకి ఎంటరైంది. మంగళవారం కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని క్షేత్ర గుడి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. పాదయాత్రలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు రాహుల్​ను కలిశారు. రాహుల్ ఈ నెల 21 వరకు కర్నూల్ లో పాదయాత్ర చేయనున్నారు. జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో 119 కిలోమీటర్ల మేర సాగనుంది. ఆ తర్వాత తిరిగి కర్నాటకలోని రాయచూరు జిల్లాలో యాత్ర ఉంటుంది. ఈ నెల 23న రాయచూరు నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర మొదలవుతుంది. నవంబర్ 7 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా 375 కిలో మీటర్లు సాగుతుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పురా, చార్మినార్, అఫ్జల్ గంజ్, మోజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, బోయిన్ పల్లి, బాలానగర్, మూసాపేట్ జంక్షన్, కూకట్‌‌‌‌పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట్, శంకరం పేట్, మద్నూర్​వరకు కొనసాగుతుంది. కాగా, దీపావళి సందర్భంగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు ఉండదు. తిరిగి 27న మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో యాత్రకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు.

యాత్రకు 13 కమిటీలు

భారత్ జోడో యాత్ర కోసం 13 కమిటీలను పీసీసీ నియమించింది.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్వీనర్ గా మొత్తం 28 మంది ముఖ్య నాయకులతో రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, చైర్మన్ లు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, పీసీసీ మాజీ అధ్యక్షులు, సీఎల్పీ మాజీ నేతలు సీఎల్పీ నేతలు, ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. ఇతర కమిటీలలో కల్చరల్ కమిటీ చైర్మన్ గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కన్వీనర్ గా అంజన్ కుమార్ యాదవ్, సామాజిక ఉద్యమకారులతో భేటీ బాధ్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  మధుయాష్కికి అప్పగించారు. పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ, కన్వీనర్ గా కుంభం అనిల్ కుమార్, మదన్ మోహన్, పాదయాత్ర సమన్వయకర్తల చైర్మన్ గా శ్రీధర్ బాబు,  కన్వీనర్ గా మల్లు రవి , ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా  మాజీ మంత్రి గడ్డం వినోద్ ,  కన్వీనర్ గా హర్కర వేణుగోపాల్,  కో కన్వీనర్ గా జగదీశ్వరరావులను నియమించారు.
-