- 4 వేల చ.కి.మీ. భారత భూభాగం కబ్జా: రాహుల్ గాంధీ
- డ్రాగన్ కంట్రీని ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ ఫెయిల్
- మా దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం అక్కర్లేదు
- భారత్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని వెల్లడి
వాషింగ్టన్: మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 4 వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకున్నదని చెప్పారు. చైనాను డీల్ చేయడంలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారని విమర్శించారు.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. మంగళవారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ విస్తీర్ణానికి సమానమైన భూమిని లడఖ్ లో చైనా ఆక్రమించుకుంది. ఇదొక డిజాస్టర్. దీనిపై మీడియా రాయడం లేదు” అని రాహుల్ అన్నారు.
Also Read:-ఈ దగ్గు మందు వాడుతున్నారా! జాగ్రత్త..నకిలీ వస్తున్నాయి
‘‘ఒకవేళ 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పొరుగు దేశం ఆక్రమిస్తే అమెరికా ఎలా స్పందిస్తుంది? సరిహద్దు వివాదాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశామని చెప్పి, ఏ అధ్యక్షుడైనా తప్పించుకోగలరా? చైనాను ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారు” అని మండిపడ్డారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడం వెనుక ఎలాంటి కారణం లేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
పాక్ ఉగ్ర చర్యలను సహించం..
పాకిస్తాన్ విషయంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని రాహుల్ అన్నారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ తో చర్చలు ఉండవని చెప్పడాన్ని సమర్థించారు. ‘‘పాక్ ప్రోత్సహిస్తున్న టెర్రరిజం.. రెండు దేశాలనూ పట్టిపీడిస్తున్నది.
పాక్ టెర్రర్ చర్యలను మేం ఏమాత్రం సహించం. ఇది ఇలాగే కొనసాగితే రెండు దేశాల మధ్య వైరమే మిగులుతుంది” అని చెప్పారు. పాక్ తో చర్చలు జరపకపోవడానికి కారణం కాశ్మీర్ అంశమేనా? అని మీడియా ప్రశ్నించగా.. అది కారణం కాదని తెలిపారు.
అమెరికా విషయంలోనూ మోదీ ప్రభుత్వ తీరు బాగానే ఉందని అన్నారు. అమెరికాతో భారత సంబంధాలను మోదీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాలకూ కీలకమని చెప్పారు.
‘‘భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని నేను కోరుకోవడం లేదు. భారత్ లో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం.. భారతీయుల పోరాటం. ఇందులో ఇతరులు చేసేదేం లేదు. ఇది మా సమస్య. మేం పరిష్కరించుకుంటం.
మా ప్రజాస్వామ్యాన్ని మేం రక్షించుకుంటం” అని తెలిపారు. మోదీతో ఎలా వ్యవహరించాలనే దానిపై అమెరికాకు సలహా ఇవ్వడం తన పరిధి కాదన్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా ఇద్దరిదీ తప్పే..
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంపైనా రాహుల్ స్పందించారు. ఇందులో రెండు దేశాలదీ తప్పు ఉందని అన్నారు. ‘‘ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడం తప్పే. కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడి చేయడం, ఇప్పటికీ దాడులు కొనసాగిస్తూ అమాయకుల ప్రాణాలు తీయడం కూడా పెద్ద తప్పే. హింస రెండు దేశాలకూ మంచిది కాదు. దీన్ని వెంటనే ఆపాలి” అని సూచించారు.
బంగ్లాదేశ్ ఇష్యూపై స్పందిస్తూ..‘‘బంగ్లాదేశ్ లోని పరిస్థితులపై భారత్ లో ఆందోళన నెలకొంది. అక్కడ మళ్లీ సాధారణ స్థితి ఏర్పడుతుందని నమ్మకం ఉంది. బంగ్లా లోని ప్రస్తుత ప్రభుత్వంతో, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంతోనూ మా సంబంధాలు కొనసాగుతాయని విశ్వసిస్తున్నాను” అని రాహుల్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.