ఇందూరు చేజిక్కేనా .. 17 పార్లమెంట్​ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్​ గెలుపు

ఇందూరు చేజిక్కేనా .. 17 పార్లమెంట్​ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్​ గెలుపు
  • సిట్టింగ్ స్థానంపై బీజేపీ ఆశలు 
  • బీఆర్‌‌ఎస్‌కు ఎదురుగాలి

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు.  నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు.  ఇక్కడ గెలవడమే  లక్ష్యంగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలో నిలిపింది. బీజేపీ, బీఆర్‌‌ఎస్ నాయకులకు చెక్ పెట్టి తిరిగి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటోంది.  ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కలిసి వస్తుందని అయితే  సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి అర్వింద్  నుంచి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.  

కాంగ్రెస్ నుంచి  గెలిచింది వీరే.. 

1952, 57, 62 వరుస ఎన్నికల్లో  కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసిన హరీశ్​చంద్రహెడా ఇక్కడి నుంచి పార్లమెంట్​కు మూడుసార్లు ఎన్నికయ్యారు.  ఢిల్లీకి చెందిన ఆయన్ని కేవలం కాంగ్రెస్​పై అభిమానంతో ఆదరించారు.  1967 ఎన్నికల్లో ఇండిపెండెంట్​ క్యాండిడేట్​గా పోటీ చేసి గెలుపొందిన ఎం.నారాయణరెడ్డి కాంగ్రెస్​ ఎంపీగానే చెలామణి అయ్యారు.  1971, 77, 80 ఎలక్షన్స్​లో ఎం.రాంగోపాల్​రెడ్డి మూడుసార్లు కాంగ్రెస్​ నుంచి గెలిచారు. 1984, 89 ఎన్నికల్లో రెండు సార్లు తాడూరి బాలాగౌడ్, 1996లో ఆత్మచరణ్ ​రెడ్డి లోక్​సభకు ఎన్నికయ్యారు.  2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్​ కాంగ్రెస్ నుంచి  గెలిచి ఎంపీ అయ్యారు. 

మధ్యలో ముగ్గురికి అవకాశం

నిజామాబాద్ నుంచి 1991లో మొదటిసారి  సినీ నటుడు ఎన్టీ రామారావు క్రేజ్​తో  కేశ్​పల్లి గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయ్యారు.  తర్వాత జరిగిన 1998, 99 ఎలక్షన్స్​లో కూడా సైకిల్​ గుర్తుపై పోటీ చేసిన ఆయనకే ఇందూరు ప్రజలు  పట్టం కట్టారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్​ఎస్​ నుంచి కవితను 2014లో ఎంపీ గా పోటీ చేసి గెలిచింది. 2019లో బీజేపీకి చెందిన ధర్మపురి అర్వింద్​ ను గెలిపించారు.  ఇప్పటివరకు కాంగ్రెసేతర ఎంపీలుగా కేశ్​పల్లి గంగారెడ్డి, కవిత, అర్వింద్​ ముగ్గురే  గెలిచారు. 

చరిత్రను గుర్తు చేయాలని.. 

కాంగ్రెస్​ గత చరిత్రను ఈసారి ఎన్నికల్లో తిరగరాయాలని కసితో ఉంది.  బీఆర్​ఎస్ గ్రాఫ్​ క్రమంగా పడిపోవడంతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్​లోకి రావడం కలిసివస్తోంది. మార్క్​ఫెడ్​ ఛైర్మన్​ మారమోహన్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్​ కుంట రమేశ్ ​రెడ్డి, బోధన్​, ఆర్మూర్​ మున్సిపల్​ చైర్​పర్సన్​లు తూము పద్మ, లావణ్య, జడ్పీ వైస్​ చైర్‌‌పర్సన్ రజిత యాదవ్​, పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గులాబీ గూటిని వదలి 'చేయి'  అందుకున్నారు.  మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర​రావు కాంగ్రెస్​లోకి రావడంతో కమ్మ సామాజిక వర్గం హస్తానికి చేరువైంది.  కీలకమైన ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు పదేండ్ల తర్వాత కాంగ్రెస్​కు ఘర్​వాపస్​ అయ్యారు.  మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు కారు దిగి కాంగ్రెస్‌లో  చేరారు.  ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎలక్షన్​ తర్వాత పార్టీ ఓట్లను పెంచే పరిణామాలేనని క్యాడర్​ అంచనా వేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు 

 నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్‌లు నిజామాబాద్ జిల్లాలో ఉండగా.. కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్‌లు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి.  మొత్తం ఏడు సెగ్మెంట్లలో ప్రస్తుతం కోరుట్ల, బాల్కొండ, జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా..  నిజామాబాద్ రూరల్, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ లో బీజేపీ నెగ్గింది. దీంతో ఈ సారి పార్లమెంటు అభ్యర్థులకు విజయం నల్లేరు మీద నడక కాదనే తెలుస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో  మిశ్రమ తీర్పు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఆర్‌‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్  సైతం ప్రతి నియోజకవర్గం, మండలాల్లో మీటింగ్‌లు పెడుతూ.. కార్యకర్తలను ఉత్సాహాపరుస్తూ ముందుకెళుతున్నారు.