రాహుల్ నిర్ణయంతో కాంగ్రెస్​కు సిన్మా కష్టాలు

రాహుల్ నిర్ణయంతో కాంగ్రెస్​కు సిన్మా కష్టాలు
  •  నాయకత్వంలో కన్ఫ్యూజన్
  • రాష్ట్రాల్లో వరుసగా వెంటాడుతున్న సమస్యలు
  • మన రాష్ట్రంలో జంప్ లతో ప్రతిపక్ష హోదా గల్లంతు
  • పంజాబ్​లో ముదిరిన కెప్టెన్, సిద్ధూ విభేదాలు
  • మూడు రాష్ట్రాల్లో సర్కార్లకుపొంచి ఉన్న ముప్పు
  • అపాయింట్ మెంట్లకూ దూరంగా ఉంటున్న రాహుల్

లోక్ సభలో వరుసగా రెండోసారి ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ కి మరిన్ని షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యతగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. దీంతో ప్రియాంకను తీసుకురావాలని కొందరు నేతలు ప్రతిపాదిస్తే దీన్ని కూడా రాహుల్ తిరస్కరించారు. తమ కుటుంబం నుంచి కాకుండా బయటివారిని పెట్టాలని షరతుపెట్టారు. రాహుల్ ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని మొదట్లో అందరూ అనుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా రాహుల్ తన మాటపై వెనక్కి తగ్గలేదు. కొత్త ఎంపీలు తనను కలవాలనుకున్నా ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలొచ్చిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్ కు కూడా రాహుల్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటివరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్, పంజాబ్ మంత్రి సిద్దూకు మాత్రమే రాహుల్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. తనను కలిసిన నేతలతో కూడా రాజీనామాను వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.

సొంత పార్టీ నేతలను కలవని రాహుల్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీఎస్ అధినేత దేవెగౌడతో మాత్రం సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో విలీనమై పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని శరద్ పవార్ ను, దేవెగౌడను రాహుల్ కోరినట్లు తెలుస్తోంది. ఇది సాధ్యం కాదనుకుంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నైనా కొద్దికాలం పాటు అధ్యక్షుడిగా ఉంచాలన్న ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర పార్టీల్లో గందరగోళం

జాతీయ నాయకత్వంలో సమస్య కొనసాగుతుంటే ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీ మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. మన రాష్ట్రంతో పాటు కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ పీసీసీలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనిపై దృష్టిపెట్టి, సరిదిద్దేవారు లేకుండా పోయారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నడూ లేనంత బలహీన స్థితికి చేరుకుంది. వరుసగా రెండోసారి అధికారం కోల్పోయినా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 3 సీట్లు గెలుచుకుంది. ఈ సంతోషం తీరకుండానే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో కలిసిపోయారు. దీనిపై సీరియస్ గా స్పందించి, జాతీయ స్థాయిలో మాట్లాడేవారే లేకుండా పోయారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి కర్నాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర తప్ప జాతీయ నేతలెవరూ రాలేదు. ఏడాది కిందే కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడంతో జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్ రంగంలోకి దిగారు. చివరికి అన్ని రకాలుగా గట్టిగా నిలబడడం వల్లే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే మన రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో పడిన సమయంలో హైకమాండ్ నుంచి మద్దతు దొరకలేదు.

పార్టీ సర్కార్లకు గండం!

కర్నాటక: జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి దినదినగండంలా మారింది. లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలోని 28 సీట్లకు బీజేపీ 25 సీట్లు గెలుచుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇస్తూ ఇరకాటంలో పెడుతున్నారు.

మధ్యప్రదేశ్: ఆరునెలల కిందే కాంగ్రెస్ గెలుచుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలోనూ పార్టీలో అంతర్గత పోరు వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారుకు సొంతంగా సరైన మెజారిటీ లేకపోవడంతో ఏ నిమిషమైనా కూలిపోయే పరిస్థితి ఉంది. బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లో 28 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎం కమల్ నాథ్ పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న ఆయన ఇటీవల కమిటీ మీటింగ్ కు హాజరు కాలేదు. అందులో ఆయన తీరుపై తీరుపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొడుకును గెలిపించుకోవడంపైనే దృష్టిపెట్టి పార్టీ గెలుపును పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. మరోవైపు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియా, దిగ్విజయ్ సింగ్ గ్రూపుల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. సీఎం, పీసీసీ చీఫ్ కమల్ నాథ్ కావడంతో ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని జ్యోతిరాదిత్య వర్గం డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కమల్ నాథ్ కు రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

రాజస్థాన్: సీఎం అశోక్ గెహ్లాట్, సచిన పైలట్ వర్గాల మధ్య విభేదాలు ముదిరిపోయాయి. పీసీసీ చీఫ్ గా పైలట్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే గెహ్లాట్ సీఎం అయ్యారన్న అసంతృప్తి ఆయన వర్గంలో ఉంది. లోక్ సభ ఎన్నికల్లోనూ సీఎం కొడుకు వైభవ్ పోటీచేసిన సీటు సహా ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. దీనికి గెహ్లాట్ కారణమనీ, ఆయన రాజీనామా చేయాలని పైలట్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు బొటాబోటి మెజారిటీయే ఉంది. రాహుల్ కూడా గెహ్లాట్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు కూడా ఢిల్లీలో రాహుల్ అపాయింట్ మెంట్ దక్కలేదు.

పంజాబ్: కాంగ్రెస్ కాస్త మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రం పంజాబ్ ఒక్కటే. అయినా రాష్ట్రంలో మరో రూపంలో కాంగ్రెస్ ను సంక్షోభం వెంటాడుతోంది. సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దూ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రాష్ట్రంలోని 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ 8 గెలుచుకోవడంతో ఆ క్రెడిట్ తనదేనని అమరీందర్ భావిస్తున్నారు. ఇదే అదనుగా తనకు పక్కలో బల్లెంలా మారిన సిద్దును కార్నర్ చేసే పనిలో పడ్డారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సిద్దూ సరిగ్గా పని చేయకపోవడం వల్లే అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ సీట్లు పోగొట్టుకుందంటూ ఆయన శాఖను మార్చేశారు అమరీందర్. దీంతో కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన సిద్దూ ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలిశారు. చాలామంది నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వని రాహుల్, ప్రియాంకతో కలిసి సిద్దూతో మాట్లాడడం విశేషం. దీంతో సిద్దూ విషయంలో అమరీందర్ తీరు సరికాదన్న సంకేతాలిచ్చినట్లైంది. దీనిపై అమరీందర్ వెనక్కి తగ్గే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

వచ్చే ఎన్నికలకు నడిపేదెవరు?

ఆరునెలల్లో మహారాష్ట్ర, హర్యానా , జార్ఖండ్,జమ్ముకాశ్మీర్ , ఢిల్లీలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో లోక్ సభ ఎన్ని కల్లో కాంగ్రెస్ ఎక్కడా బోణీ చేయలేదు. ఓటమిని మరిచిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడాలన్నా దిశానిర్దేశం చేయాల్సి న జాతీయ నాయకత్వమే గందరగోళంలో ఉంది . మొత్తం మీద 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను నడిపించే నేతల అవసరం ఏర్పడింది . రాహుల్ నిర్ణయం మార్చుకో వడమో లేక కొత్త నాయకుడు వస్తేనో తప్ప పార్టీ సమస్యలు తీరే అవకాశం లేదు.