సుడాపై నేతల నజర్ .. చైర్మన్ ​పదవిపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు

సుడాపై నేతల నజర్ .. చైర్మన్ ​పదవిపై కాంగ్రెస్ నేతల్లో ఆశలు
  • రేసులో అరడజను మంది లీడర్లు 

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ(సుడా) చైర్మన్ పదవి  కోసం అరడజను మంది కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనుండడంతో పలువురు కాంగ్రెస్ నేతలు సుడా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు సుడాలో విలీనమైన 19 గ్రామాల నేతలు రేసులో ఉన్నారు. 

దాదాపు దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు సుడా పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ టికెట్ ఆశించిన వారితో పాటు మరికొంత మంది చైర్మన్ పదవిని పొందాలని ప్రయత్నిస్తుంటే మరికొందరు సుడాలో సభ్యుడిగానైనా అవకాశం పొందేందుకు రాష్ట్ర నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఏడేళ్ల క్రితం సుడా ఏర్పాటు

సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, కొండపాక, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 19  గ్రామాలను కలుపుకుని సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ(సుడా) ఏర్పాటు చేశారు. సుడాకు సిద్దిపేట కమిషనర్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తే,  చైర్మన్ తో పాటు మరో 20 మంది సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. 2018లో మొదటి సారి సుడా చైర్మన్ గా మారెడ్డి రవీందర్ రెడ్డితో పాటు మరో 20 మంది సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసింది. అప్పుడు విడుదల చేసిన ఉత్తర్వుల్లో చైర్మన్ కాలపరిమితి నిర్ణయించలేదు. దీంతో సుడా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు మారెడ్డి రవీందర్ రెడ్డి  చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో సుడా పాలక వర్గం రద్దయింది. కొత్తగా కాంగ్రెస్ నేతలు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

ఆశావహుల ప్రయత్నాలు

గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవులను కాంగ్రెస్​ప్రభుత్వం రద్దు చేయడంతో పలువురు పార్టీ నేతలు సుడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సుడా చైర్మన్ పదవి కోసం తాడూరి శ్రీనివాస గౌడ్, దర్పల్లి చంద్రం, బొమ్మల యాదగిరి, సూర్యవర్మ, దాస అంజయ్య, మార్క సతీశ్, అత్తు ఇమామ్ తో పాటు మరి కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా మంత్రులు  పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా తో పాటు ఇతర ముఖ్యమైన మంత్రులను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్​ల్లో అభ్యర్థిత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నారు