ప్రతిరోజూ ‘ప్రజాదర్బార్’

ప్రతిరోజూ ‘ప్రజాదర్బార్’
  • ప్రతిరోజూ ‘ప్రజాదర్బార్’
  • ప్రజలకు అందుబాటులో సీఎం, ఎమ్మెల్యేలు
  • ‘సుపరిపాలన’ పేరిట మేనిఫెస్టోలో ప్రత్యేక చాప్టర్​
  • బీఆర్​ఎస్​ అవినీతిపై రిటైర్డ్​ జడ్జితో విచారణ
  • జనానికి మెరుగైన సేవల కోసం పౌర సేవల హక్కుల చట్టం
  • జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు.. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు పీవీ పేరు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కేసీఆర్​ పాలన అస్తవ్యస్తంగా ఉందన్నది కాంగ్రెస్​ పార్టీ ప్రధాన ఆరోపణ. ప్రగతి భవన్​లోకి కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకూ ప్రవేశం లేకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నది. ఈ నేపథ్యంలో.. తాము అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తామని కాంగ్రెస్​ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ముఖ్యమంత్రి క్యాంప్​ ఆఫీసులోకి సామాన్యుడూ వచ్చేలా ‘ప్రజాదర్బార్​’ను నిర్వహిస్తామని  హామీనిచ్చింది. మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యాంశంగా (చాప్టర్​ 1) ‘సుపరిపాలన’ అంశానికి చోటిచ్చింది. 

బీఆర్​ఎస్​ ప్రభుత్వ నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పాలనను అందిస్తామని పేర్కొంది. గతంలో తమ ప్రభుత్వం (ఉమ్మడి రాష్ట్రంలో) సీఎం క్యాంప్​ ఆఫీసులో పెట్టినట్టే ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి రోజూ ‘ప్రజా దర్బార్​’ను నిర్వహిస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ‘ప్రజదర్బార్​’లు నిర్వహిస్తారని పేర్కొంది.

 అంతేగాకుండా బీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనలోని కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై  హైకోర్టు  రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో కాంగ్రెస్​ ప్రకటించింది. 

కాంగ్రెస్​ ‘సుపరిపాలన’ చాప్టర్​లోని మరిన్ని అంశాలు

*ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పౌర సేవల హక్కుల చట్టం రూపకల్పన.
*ప్రజలు ఫిర్యాదు చేసేందుకు సమగ్రమైన పోర్టల్, టోల్​ ఫ్రీ నంబర్​ ఏర్పాటు. నిర్ణీత సమయంలో   ఆయా ఫిర్యాదుల పరిష్కారం.
*అన్ని ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు గ్రామాల్లో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు.
*జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు.
* జనగామ జిల్లాకు సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ పేరు. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు పేరు.