ఆగస్టు 30 న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ సభ..హాజరుకానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి

ఆగస్టు 30 న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ సభ..హాజరుకానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి
  • ప్రచారాన్ని స్పీడప్ చేసిన కాంగ్రెస్
  • ఉప ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు 
  • ఈసీకి పోలింగ్ స్టేషన్ల పెంపు ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 30న ఈ నియోజకవర్గ పరిధిలో సభ నిర్వహించనున్నది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. వాస్తవానికి ఈ సభను మంగళవారం (ఈ నెల 26న) నిర్వహించాలని నిర్ణయించారు. 

అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో  చేస్తున్న ‘ఓట్​అధికార్’​ యాత్రలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ తో పాటు ముఖ్య నేతలు మంగళవారం అక్కడికి వెళ్తున్నారు. దీంతో సభను ఈ నెల 30 కి వాయిదా వేశారు. 

హైకమాండ్ పిలుపులో భాగంగా ‘‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’’ నినాదంతో రాహుల్ యాత్రకు సంఘీభావంగా జూబ్లీహిల్స్ లో ఈ సభను నిర్వహిస్తున్నామని పీసీసీ అధికారికంగా ప్రకటించినా.. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేసి, వారిలో జోష్ నింపేందుకే ఈ సభను పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితమే జూబ్లీహిల్స్ లో కూడా రిపీట్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్ దే అనే సిగ్నల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇన్​చార్జ్ మంత్రుల బస్తీ బాట

ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం ముగ్గురు మంత్రులు వివేక్ వెంకట
స్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ఇన్​చార్జ్​లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో మంత్రి రెండు డివిజన్ల బాధ్యతలు చూస్తూ బూత్ స్థాయి సమావేశాలతో పార్టీ క్యాడర్లో జోష్ తీసుకువస్తున్నారు. అలాగే బస్తీల బాట పడుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. బీహార్ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నిక అక్టోబర్ లో జరుగనుందని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా తమ ప్రచార స్పీడప్​చేసింది. 

ఇప్పటి వరకు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు, బస్తీబాటతో జనం సమస్యలు తెలుసుకున్న పార్టీ నేతలు, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో సభ ఏర్పాటు చేసి పార్టీకి అనుకూల వాతావరణం తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానుండడంతో కాంగ్రెస్ కు కొంత వరకు ఊపు వచ్చే అవకాశం లేకపోలేదు. అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా.. అభ్యర్థి ఎవరనేది కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యండి అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తున్నది. 

ఎన్నికలకు అధికారుల సన్నద్ధత

అధికారులు కూడా ఉప ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గంలో  పోలింగ్ స్టేషన్లను పెంచి ప్రజలకు వీటిని మరింత అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో 329 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఇప్పుడు వాటిని 408 కి పెంచేందుకు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ ముందు ఉంచారు.

 ఈ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవల్ అధికారులను అందుబా టులో ఉంచగా, అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్ల జాబితాను వెంటనే అందజేయాలని ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కోరారు.