రెండు నెలల్లో మూడుసార్లు పార్టీ ఫిరాయింపు

రెండు నెలల్లో మూడుసార్లు పార్టీ ఫిరాయింపు

చండీఘడ్ : ఎన్నికల సీజన్లో రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఇవాళ ఒక పార్టీ కండువాతో కనిపిస్తే.. రేపు మరో పార్టీ గుర్తుతో ప్రచారం చేస్తుంటారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లద్దీ ఈ కోవలోకే వస్తారు. టికెట్ వస్తుందోలేదోనన్న అనుమానంతో ఆయన రెండు నెలల వ్యవధిలో మూడుసార్లు పార్టీ మారారు. అయినా చివరకు ఆయనకు నిరాశే మిగిలింది. 

గురుదాస్ పూర్ జిల్లా హరగోబింద్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లద్దీ గతఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి తనకు టికెట్ ఇస్తుందో లేదోనన్న అనుమానంతో మరో కాంగ్రెస్ నేత ఫతేజంగ్ బజ్వాతో కలిసి డిసెంబర్ 28న బీజేపీలో చేరారు. ఏం జరిగిందో తెలియదుగానీ వారం తిరిగేలోగా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ మరో నాయకునికి కేటాయించింది. దీంతో ఆయన మరోసారి బీజేపీ పార్టీలోకి జంప్ అయ్యారు. ఫిబ్రవరి 11న పార్టీ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

117 అసెబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌, ఆప్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.