
- జగదీశ్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరేశం, అనిల్ సవాల్
- గత బీఆర్ఎస్ హయాంలో భారీ స్కామ్‌లు
- మాజీ మంత్రి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నామని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. 2014 కు ముందు ఎంత, తర్వాత తన ఆస్తులు ఎంత అనే దానిపై జగదీశ్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ సిరారు. గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్, జగదీశ్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని వీరేశం మండిపడ్డారు. ‘‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక స్కామ్ లు జరిగాయి. ఎలాంటి అక్రమాలు జరగలేదని, జుడీషియల్ విచారణ చేయాలని కేసీఆర్ డైరెక్షన్ లో అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
ఇప్పుడు మాత్రం విచారణ చేపట్టవద్దని అనడం ఏంటి? విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు బయట బడతాయనే జుడీషియల్ విచారణకు హాజరుకాబోమని వారు అంటున్నారు. పోరాడేతత్వం ఉన్న కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారు? ఇసుక దందా చేసేందుకే కేసీఆర్ యాదాద్రి వపర్ ప్లాంట్ తెచ్చిండు” అని వీరేశం వ్యాఖ్యానించారు. భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై జగదీశ్ రెడ్డి మాటలు దయ్యాలే వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని, అందుకే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు.