ధరణి పేరుతో కొట్లాటలు పెట్టిండు.. ఏ గ్రామంలో చూసినా సమస్యలే

ధరణి పేరుతో కొట్లాటలు పెట్టిండు.. ఏ గ్రామంలో చూసినా సమస్యలే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను పునరుద్దరిస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రతినిధులు అనే వారు లేకుండా పోయారన్నారు. అసలు ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వోలను ఎందుకు రద్దు చేసిందో తెలియడం లేదన్నారు. 

రాష్ట్రంలో ధరణితో భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని..ధరణి సమస్యలు లేని గ్రామమే లేదన్నారు జీవన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక ధరణి సమస్యలను పరిష్కరించి..నూతన విధానాన్ని అమలు చేస్తామని జీవన్ రెడ్డి చెప్పారు. రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నాలుగు నెలల్లో ధరణి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో సాగుకాలం తొలగించిన రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. ధరణిలో నమోదు కానీ డాక్యుమెంట్స్ వేలల్లో ఉన్నాయని చెప్పారు.

Also Read :- మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం

రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ లకు ఫీజులు వసూలు చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పట్టా మార్పిడి రుసుం పేరుతో ప్రతి ఎకరాకు రూ. 2500 కట్టాలని..మంజూరుకు కూడా ఫీజు కట్టాలా..ఇది కేసీఆర్ పన్ను అని విమర్శించారు. కేసీఆర్ కు చిత్త శుద్ది ఉంటే పట్టా మార్పిడి ఫీజు 2500 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ మొదలవుతుందని మంత్రి హరీష్ రావు అంటున్నారని..అసలు పటేల్ పట్వారీ వ్యవస్థకు, ధరణికి ఏం సంబంధం అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పటేల్ పట్వారీ వ్యవస్థ కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందే రద్దయిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు కొలువులను ఇవ్వడానికా..? లేక తీయడానికా అని నిలదీశారు. 30వేల నిరుద్యోగుల కొత్త ఉద్యోగాలను కేసీఆర్ కొల్లగొట్టారని మండిపడ్డారు.