ఇంత విపత్తు జరిగితే బీజేపీ ఏం చేస్తున్నది?..కేంద్రమే ముందుకొచ్చి నష్టపరిహారం ప్రకటించొచ్చు కదా? : కాంగ్రెస్ఎమ్మెల్సీలు

ఇంత విపత్తు జరిగితే  బీజేపీ ఏం చేస్తున్నది?..కేంద్రమే ముందుకొచ్చి నష్టపరిహారం ప్రకటించొచ్చు కదా? : కాంగ్రెస్ఎమ్మెల్సీలు
  • ప్రజలు అధైర్య పడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
  • ప్రజల్నే  దోషులుగా చూపటం కామారెడ్డి ఎమ్మెల్యేకు సరికాదు
  • వరద ప్రాభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు

కామారెడ్డి, వెలుగు: భారీ వర్షం, వరదలతో ఇంత విపత్తు సంభవించినా బీజేపీ ఏం చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. కేంద్రమే ముందుకొచ్చి నష్టపరిహారం ప్రకటించాల్సిందన్నారు. ఇటీవల భారీ వరదలతో దెబ్బతిన్న కామారెడ్డి టౌన్​లోని పలు ప్రాంతాలను ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బల్మూరి వెంకట్ పరిశీలించారు. జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీల్లో ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. 

వరదలు వచ్చి నష్టపోయిన ఇండ్లను పరిశీలించి.. బాధితులతో మాట్లాడారు. భారీ వరదలు వచ్చి పూర్తిగా నష్టపోయామని, ఇంతటి విపత్కర పరిస్థితి ఎప్పుడు చూడలేదని బాధితులు పేర్కొన్నారు. విలువైన వస్తువులు, సర్టిఫికేట్లు, ఎలక్ట్రానిక్​ పరికరాలు పూర్తిగా తడిసిపోయామన్నారు. అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని, బాధితులకు ఎమ్మెల్సీలు భరోసా కల్పించారు. కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్​తో మాట్లాడి జిల్లాలో వరద నష్టం వివరాలు, సహయక చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బల్మూరి వెంకట్​ మీడియాతో మాట్లాడారు. 

కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించడం లేదు

తెలంగాణ ప్రజలు బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని, ఇంత పెద్ద ఆపద వస్తే కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా పరిహారం ప్రకటించవచ్చు కదా అన్నారు. కిషన్​రెడ్డి, బండి సంజయ్​కేంద్ర మంత్రులై ఉండి సాయంపై స్పందించడం లేదన్నారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వారు వచ్చి ఇక్కడి ప్రజలను పలకరించలేదన్నారు. ఇద్దరు పెద్ద నాయకులను కాదని కామారెడ్డి ప్రజలు సామాన్యుడైన వెంకటరమణరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ప్రజలనే దోషులుగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. 

ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడి నష్టంపై పీసీసీకి నివేదిక ఇస్తామని, సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ సాయంతో పాటు  కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చూస్తామన్నారు. బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల్లో కూడా నష్టం ఎక్కువగానే ఉందని ఆ ఏరియాల్లో కూడా పర్యటిస్తామన్నారు. కైలాస్ శ్రీనివాస్​రావు, మద్ది చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రాకరణ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.