టీఆర్ఎస్‌‌కు ఓటేస్తే.. మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (MRS) కూడా పెడతాడు

టీఆర్ఎస్‌‌కు ఓటేస్తే.. మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (MRS) కూడా పెడతాడు

హైదరాబాద్: దొంగమాటలు చెప్పడంలో సీఎం కేసీఆర్ మొనగాడు అని మల్కాజ్‌‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్‌‌లోని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ అభ్యర్థి రజితా పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌లో చేరారు. వారందరికీ రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌, కేటీఆర్‌‌పై రేవంత్ విరుచుకుపడ్డారు.

‘దొంగమాటలు చెప్పడంలో కేసీఆర్ మొనగాడు. కేటీఆర్ పొద్దున లేస్తే వాళ్ల నాయన గురించి గప్పాలు కొడుతున్నాడు. హైదరాబాద్‌‌లో రూ.67 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న కేటీఆర్.. ఉప్పల్ డివిజన్‌‌లో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి. కంటినొప్పి, పంటినొప్పి వచ్చినా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. కానీ సామాన్యులకు మాత్రం వైద్యం దిక్కులేదు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ వెనక్కు పోవాలంటే టీఆర్ఎస్‌‌ను ఓడించాలి. మళ్లీ టీఆర్ఎస్‌‌కు ఓటేస్తే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎంఆర్ఎస్‌‌ను కూడా కేసీఆర్ పెడతారు. కరోనా, వరదలు వచ్చినప్పుడు కనిపించని టీఆర్ఎస్ నేతలు.. ఇవ్వాళ సిగ్గు లేకుండా ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. నాకు తోడుగా పాతిక, ముప్పై మంది కార్పొరేటర్లు మద్దతుగా ఉంటే కేసీఆర్, మోడీనే కాదు.. ఎవ్వరితోనైనా కొట్లాడతా’ అని రేవంత్ పేర్కొన్నారు.