కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగు చేయలేదు

కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగు చేయలేదు

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం టూరిస్ట్ స్పాట్‌‌గా ఉపయోగపడతదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అన్నారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి భారీగా నిధులు తెచ్చి కాళేశ్వరం నిర్మించారని, అంత ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్‌‌ కింద ఇప్పటి వరకు ఒక్క ఎకరం సాగు కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో గోదావరి నీరు ఉపయోగించుకునేందుకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల స్కీం కింద రూ.వేల కోట్లు ఖర్చు పెడితే, కమీషన్ల కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్‌‌ రీ డిజైన్ చేశారన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన  తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిలిపేలా సుప్రీంకోర్టులో కేసు వేసి, స్టే తెస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్ట్‌‌లలో అవినీతి జరిగిందని ప్రధానికి తెలుసునని, కానీ, ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. తెలంగాణకు వస్తున్న 7 టీఎంసీల నీటీని ఏపీ తీసుకుపోతుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.