అప్పట్లో అవినీతిపై ట్వీట్​ చేసి.. నోట్ల కట్టలు ఎలా పోగేస్తారోనని ఎంపీ ధీరజ్ ఆశ్చర్యం

 అప్పట్లో అవినీతిపై ట్వీట్​ చేసి.. నోట్ల కట్టలు ఎలా పోగేస్తారోనని ఎంపీ ధీరజ్ ఆశ్చర్యం

న్యూఢిల్లీ :  జార్ఖండ్‌‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో  రూ. వందల కోట్లు బయటపడ్డాయి. సంచుల కొద్దీ నోట్ల కట్టలు దొరకిన నేపథ్యంలో గతంలో ధీరజ్ చేసిన ఓ ట్వీట్​ను నెటిజన్లు రీట్వీట్​ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. 'పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా మన దేశంలో నల్లధనం, అవినీతిని చూస్తుంటే బాధగా ఉంది. అంత డబ్బు ఒకే దగ్గర ఎలా పోగవుతుందో నాకర్థం కావడం లేదు. కాంగ్రెస్ మాత్రమే  దేశంలో అవినీతిని అంతం చేస్తుంది' అని ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. ఈ ట్వీట్​ను బీజేపీ నేత అమిత్ మాలవీయ రీట్వీట్ చేశారు. 'ధీరజ్ ప్రసాద్ సాహుకు మంచి హాస్య చతురత ఉంది' అని ఎద్దేవా చేశారు.

5 రోజులుగా..40 మెషిన్లతో కౌంటింగ్

ధీరజ్ ప్రసాద్ సాహు నుంచి ఇప్పటివరకు సీజ్ చేసిన డబ్బు రూ.353.5 కోట్లుగా లెక్క తేలింది. ఎంపీ కుటుంబానికి చెందిన ఒడిశాలోని డిస్టిలరీ కంపెనీలో దొరికిన నోట్ల గుట్టలను ఆరు రోజుల పాటు 50 మంది బ్యాంక్  అధికారులు.. 40 కౌంటింగ్ మెషిన్లతో  లెక్కించారు. ఓ దర్యాప్తు సంస్థ చేపట్టిన సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి.  దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ధీరజ్ సాహు వద్ద దొరికిన ఈ నల్ల డబ్బు ఎవరిదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్, కరప్షన్ ఒకే నాణానికి రెండు ముఖాలు వంటివని విమర్శించింది. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు కేవలం ప్రచారమేనని అనేందుకు ఈ ఘటన నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  పేర్కొన్నారు.