‘కాంగ్రెస్‌ వెంటిలేటర్‌‌పై ఉంది.. ఏ ప్లాస్మా థెరపీ దాన్ని కాపాడలేదు’

‘కాంగ్రెస్‌ వెంటిలేటర్‌‌పై ఉంది.. ఏ ప్లాస్మా థెరపీ దాన్ని కాపాడలేదు’
  • ఆప్‌ అధికార ప్రతినిధి రాఘవ చాదా
  • బీజేపీపై విమర్శలు చేసిన ఆప్‌నేత

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో నెలకొన్న పొలిటికల్‌ డ్రామాపై ఆప్‌ నేత విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ వెంటిలేటర్‌‌పై ఉందని, ప్లాస్మా థెరపీ, ఏ వ్యాక్సిన్‌ దాన్ని కాపాడలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ చాదా ఎద్దేవా చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న టైంలో చెత్త పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఇక భవిష్యత్తులో దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు అవసరం అని అన్నారు. “ రాజస్థాన్‌లో జరుగుతున్న పొలిటికల్‌ డ్రామాను దేశ ప్రజలంతా చూస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మన దేశంలో మాత్రం ఒక పార్టీ ఎమ్మెల్యేలను అమ్మాలని చూస్తోంది.. మరో పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తోంది” అని ఆయన ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు ఆమ్‌ ఆద్మీ పార్టీనే ప్రత్యామ్నాయంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని, 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆప్‌ ముసలిదైపోయిందని, కచ్చితంగా కూలిపోతుందని ఆయన అన్నారు.