బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల పక్కచూపులు..ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీ ఫోకస్

బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల పక్కచూపులు..ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీ ఫోకస్
  • కాంగ్రెస్  వైపు మొగ్గు చూపుతున్న ఎంపీటీసీలు, కౌన్సిలర్లు
  • క్యాంప్​లకు తీసుకెళ్లినా ఓట్లు పడతాయనే నమ్మకం లేక సతమతమవుతున్న బీఆర్ఎస్​ నేతలు

గద్వాల, వెలుగు: మహబూబ్ నగర్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్  పార్టీ ఫోకస్​ పెట్టింది. గద్వాల జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ బీఆర్ఎస్​కు చెందిన వారే. అలాగే 90 శాతం మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ వాళ్లే. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నడిగడ్డలో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్  ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు క్యూ కడుతున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొందరు పార్టీ మారగా, కాంగ్రెస్  ప్రభుత్వం కొలువు దీరగానే చాలా మంది కాంగ్రెస్  పార్టీ నేతలతో టచ్ లోకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే చాలా మంది పార్టీ కండువా మార్చేసుకుంటున్నారు. మూడు రోజుల కింద గద్వాల మున్సిపల్  చైర్మన్  బీఎస్ కేశవ్, 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్  పార్టీలో చేరారు. వడ్డేపల్లి మున్సిపల్​ కౌన్సిలర్లతో పాటు ఆ మండలానికి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కాంగ్రెస్​లో చేరేందుకు రెడీ అయ్యారు.

గద్వాల జిల్లాలో 233 ఓట్లు..

జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఓట్లతో కలుపుకొని 233 ఓట్లు ఉన్నాయి. 141 మంది ఎంపీటీసీలు, 12 మంది జడ్పీటీసీలు, 77 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 200 మంది బీఆర్ఎస్ కు చెందిన వారున్నారు. ఇలా చూసుకుంటే బీఆర్ఎస్  క్యాండిడేట్​కు 180 నుంచి 200 ఓట్లు పడాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పార్టీ మారడంతో కాంగ్రెస్  అభ్యర్థికి 150 నుంచి 160 ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అలంపూర్ లో ఎమ్మెల్సీ చల్లా సైలెంట్!

అలంపూర్  నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అలంపూర్  నియోజకవర్గంలో బీఆర్ఎస్  పార్టీ బలంగా ఉంది. వాస్తవంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు పడాలి. కానీ ఎమ్మెల్సీ సైలెంట్ గా ఉండడం, ఆ పార్టీకి చెందిన సీనియర్  నాయకుడు వడ్డేపల్లి శీనుతో పాటు కొందరు కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీ మారుతుండడంతో కాంగ్రెస్  అభ్యర్థికే మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్  పార్టీలో ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  చేరడంతో అసంతృప్తితో సైలెంట్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడం, అడిగిన వాళ్లకు మీ ఇష్టం అని చెప్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గోవాలో బీఆర్ఎస్  క్యాంప్..

ఎలాగైనా ఓట్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్​ నేతలు గోవాలో క్యాంప్​ నిర్వహిస్తున్నారు. గద్వాల జిల్లా నుంచి 60 మందిని గోవా తరలించారు. ఇందులో అలంపూర్  నియోజకవర్గం నుంచి 33 మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో చాలా మంది కాంగ్రెస్  పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారనే టాక్  నడుస్తోంది. బీఆర్ఎస్  క్యాంప్ లో ఉన్నవారిలో కొందరు కాంగ్రెస్  క్యాండిడేట్​కు ఓట్లు వేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే గద్వాల మున్సిపాలిటీలో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంపై స్పష్టత రాలేదు.

గోవాలోనే రెండు పార్టీల క్యాంప్..

వనపర్తి, వెలుగు: జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఇతర పార్టీల్లోకి జంప్​ కాకుండా కాపాడుకునేందుకు ఆయా పార్టీల నేతలు క్యాంప్​లకు తరలించారు. ఈ నెల 21న బీఆర్ఎస్, మరుసటి రోజు కాంగ్రెస్​ పార్టీ  నాయకులు తమ పార్టీకి చెందిన లోకల్​ బాడీ మెంబర్లను క్యాంప్​నకు తీసుకెళ్లారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్​ మెంబర్లను గోవాకే తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే ఓటర్లకు రెండు పార్టీల క్యాండిడేట్లు కొంత నగదు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

అయినప్పటికీ పార్టీ మారి వేరే క్యాండిడేట్​కు ఓటేయకుండా ఈ నెల 27 వరకు క్యాంప్​లో ఉంచుతున్నారు.  28న నేరుగా పోలింగ్​ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంప్​లకు వెళ్లిన వారు తమకే ఓటేస్తారనే నమ్మకం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతుండగా, క్యాంప్​లో ఉన్న వారి గొంతెమ్మ కోరికలు విని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కాస్ట్​లీ మద్యం కావాలంటున్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మెంబర్లు జారిపోకుండా కాపాడుకోవడం తలకు మించిన భారంగా భావిస్తున్నారు.  నియోకవర్గంలో ఎమ్మెల్యేతో కలిపి 121 మంది ఓటర్లు ఉండగా, 100 ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్​ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల వారికి క్రాస్​ ఓటింగ్​ భయం పట్టుకుంది.